మా నాన్న పండు తెచ్చాడని ఆ పసి హృదయం ఎంతో మురిసిపోయింది. తనకోసం ప్రేమగా తెచ్చిన ఆ సపోటా పండును అమాయకంగా తీసుకొని ఇష్టంగా తినేసింది. కానీ, కంటికి రెప్పలా కాపాడాల్సిన ఆ చేతులే తనకు మరణ శాసనం రాస్తాయని ఆ రెండేళ్ల చిన్నారికి ఏం తెలుసు? తండ్రి మమకారం ముసుగులో దాగున్న కిరాతకాన్ని పసిగట్టలేక, ఆ పండుతో పాటే విషాన్ని మింగిన ఆ అభం శుభం తెలియని చిన్నారి ప్రాణం చివరకు ఈ హృదయవిదారక ఘటన భువనగిరి జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి జిల్లా సంస్థాన్‌నారాయణపురం మండలం లచ్చమ్మగూడెం గ్రామానికి చెందిన వరికుప్పల రవికి మూడేళ్ల క్రితం రంగారెడ్డి జిల్లా మాడ్గులకు చెందిన స్వాతితో వివాహమైంది. వీరికి మేఘన (2), తొమ్మిది నెలల చిన్నారి మయూరి సంతానం. పెళ్లి తర్వాత కొన్నాళ్లు బాగానే ఉన్నారు. అయితే ఆ తర్వాత దంపతుల మధ్య గొడవలు మెుదలయ్యాయి. తరుచూ భార్యభర్తలు గొడవ పడేవారు. భర్త తీరుతో విసిగిపోయిన స్వాతి.. చిన్న కూతురు మయూరిని తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. గత మూడు నెలలుగా స్వాతి మాడ్గులలోనే ఉంటోంది. మేఘనను మాత్రం తండ్రి రవి తల్లి వద్దకు పంపకుండా తన వద్దే ఉంచుకున్నాడు. రవి తన తల్లి సాయంతో చిన్నారి ఆలనాపాలనా చూసేవాడు. అయితే పెద్ద కుమార్తె మేఘనను కూడా తన వద్దకు పంపించాలని స్వాతి గత కొన్ని రోజులుగా కోరుతుంది. అందుకు పెద్దల సాయం కూడా తీసుకుంది. అయినా రవి చిన్నారిని పంపించకపోవటం, పెద్దల మాట కూడా వినకపోవడంతో మాడ్గులపల్లి పోలీస్‌స్టేషన్‌లో కొన్ని రోజుల క్రితం ఫిర్యాదు చేసింది. అక్కడి పోలీసులు నారాయణపురం పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో స్థానిక పోలీసులు రవిని పిలిపించి మాట్లాడారు. పెద్దమనుషుల సమక్షంలో సోమవారం (మార్చి 23) మాట్లాడుకోవాల్సి ఉంది. అంతలోనే అతడు తన కుమార్తె మేఘనను కడతేర్చాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు శనివారం (మార్చి 21) సపోటా పండులో ఎలుకల మందు పెట్టి చిన్నారికి ఇచ్చాడు. తండ్రి ప్రేమతో ఇచ్చిన పండును చిన్నారి ఇష్టంగా తినేసింది. ఆ తర్వాత కొద్దిసేపటికే వాంతులు చేసుకొని అపస్మారక స్థితిలోకి వెళ్లింది.రవి కూడా చనిపోవాలని డిసైడ్ అయ్యాడు. నిద్రమాత్రలు మింగటంతోపాటు, ఎలుకల మందు నీళ్లలో కలుపుకొని తాగేశాడు. గమనించిన కుటుంబ సభ్యులు రవిని వెంటనే నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి, చిన్నారిని హైదరాబాద్ నిలోఫర్‌ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చిన్నారి మేఘన సోమవారం మృతి చెందింది. స్వాతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. రవి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. భార్య భర్తల మధ్య గొడవ ఏ పాపం తెలియని చిన్నారి ప్రాణం తీసిందని గ్రామస్తులు, కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.