హైదరాబాద్‌లో పెట్రోల్ కొరత ఉందా? బంకులు ఎందుకు మూతపడుతున్నాయి? పౌరసరఫరాల శాఖ క్లారిటీ

Wait 5 sec.

ఎంకి పెళ్లి సుబ్బి సావుకు వచ్చినట్లు , పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి. డిమాండ్‌కు సరఫరా చమురు లభ్యత లేకపోటవంతో చాలా దేశాల్లో వంట గ్యాస్‌తో పాటు ఇంధన కొరత ఏర్పడింది. ఇప్పుడి సెగ హైదరాబాద్ నగరాన్ని కూడా తాకింది. ఆందోళన నెలకొంది. జనం బంకుల ముందు బారులు తీరుతున్నారు. దానికి కారణం స్టాకు అయిపోయి కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్‌ బంకులు మూతపడటం. గత రెండు రోజులుగా నగరంలోని పలు చోట్ల పెట్రోల్‌ బంకులు మూతపడ్డాయి. గతంలో ఆయిల్‌ సంస్థలు డబ్బులు తీసుకోకుండానే తొలుత డీజిల్, పెట్రోల్‌ బంకులకు సరఫరా చేసేవి. స్టాక్ సేల్ అయ్యాక ఒకటి రెండు రోజుల తర్వాత బంకుల యజమానులు ఆయిల్‌ సంస్థలకు తిరిగి డబ్బులు చెల్లించేవారు. కానీ మూడు నాలుగు రోజులుగా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎంత ఇంధనం కావాలంటే ఆ మేరకు డబ్బులు చెల్లిస్తేనే పెట్రోల్, డీజిల్ సరఫరా చేస్తామని ఆయిల్‌ సంస్థలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో నగరంలో పలు బంకులకు సరఫరా నిలిచిపోయింది. పాతబకాయిలు వెంటనే చెల్లించాలని కొత్తగా స్టాక్‌కు డబ్బులు ముందే చెల్లించాలని ఆయిల్ సంస్థలు చెబుతుండడంతో నగరంలో పలు చోట్ల బంకులు మూతపడ్డాయి. దీంతో పెట్రోల్‌ ఉన్న బంకులపై ఒత్తిడి పెరిగి ఒక్క రోజులోనే స్టాకు అయిపోతోంది. మళ్లీ స్టాకు వచ్చేవరకు ఆయా బంకులు మూతపడుతున్నాయి. కాగా, ఆయిల్‌ కంపెనీలు ఉద్దేశ పూర్వకంగానే ఇబ్బందులకు గురిచేస్తున్నాయని బంకుల యజమానులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో కొత్తగా మార్పులు తీసుకురావటం సరైందికాదని అంటున్నారు. ఆయిల్‌ కంపెనీలు, పెట్రోల్‌ బంకులు మధ్య ఏర్పడిన వివాదంతో హైదరాబాద్ నగరంలో పెట్రోలు బంకులు మూతపడుతున్నా పౌరసరఫరాలశాఖ చోద్యం చూస్తోందని బంకుల యజమానులు వాపోతున్నారు. పెట్రోల్, డీజిల్‌కు కొరత లేదని చేతులు దులిపేసుకుంటున్నారే తప్ప కావాల్సిన చర్యలు తీసుకోవటం లేదని విమర్శిస్తున్నారు. కాగా, హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణలో ఎక్కడా పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్‌ కొరత లేదని పౌర సరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. డిపోలలో తగినంత ఇంధనం ఉందని అంటున్నారు. ప్రజలు అనవసరంగా ఆందోళనకు గురై తమ వాహనాలను ఫుల్ ట్యాంకులు చేసుకునేందుకు ఎగబడటం వల్ల కృత్రిమ కొరత ఏర్పడే ఛాన్స్ ఉందని హెచ్చరిస్తున్నారు. ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు ముందస్తు చెల్లింపు విధానాల్లో చేసిన కొన్ని మార్పుల వల్ల బంకు యజమానులకు తాత్కాలిక సమస్య ఏర్పడిందని చెబుతున్నారు. అంతే కానీ ఎక్కడా పెట్రోల్, డీజిల్ కొరత లేదని.. సరఫరాలోనూ ఎలాంటి లోపం లేదని పౌర సరఫరాల శాఖ క్లారిటీ ఇచ్చింది.