ఏపీలో రైలు ప్రయాణికులకు ముఖ్యమైన గమనిక. విశాఖపట్నం నుంచి తిరుపతి, బెంగళూరు, చర్లపల్లి ప్రత్యేక రైళ్లు ఇకపై వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లుగా శాశ్వత ప్రాతిపదికన నడవనున్నాయి. ఏప్రిల్ 1 నుంచి విశాఖపట్నం-తిరుపతి-విశాఖపట్నం (18505/18506) ఎక్స్‌ప్రెస్‌, ఏప్రిల్ 3 నుంచి విశాఖపట్నం-చర్లపల్లి-విశాఖపట్నం (18527/18528) ఎక్స్‌ప్రెస్.. ఏప్రిల్ 5 నుంచి విశాఖపట్నం-బెంగళూరు-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు (18509/18510) అందుబాటులోకి వస్తాయని రైల్వే అధికారులు తెలిపారు. కనెక్టివిటీ పెంచడంతో పాటుగా వేసవి రద్దీ, ప్రయాణికుల డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 1 నుంచి ప్రతి బుధవారం విశాఖపట్నం-తిరుపతి (18505) రైలు విశాఖపట్నంలో రాత్రి 7 గంటలకు బయలుదేరి.. మరుసటిరోజు ఉదయం 9.30 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. ఏప్రిల్‌ 2 నుంచి ప్రతి గురువారం ఈ రైలు (18506) తిరుగు ప్రయాణంలో రాత్రి 9.50 గంటలకు తిరుపతిలో బయలుదేరి మరుసటిరోజు మధ్యాహ్నం 1.30 గంటకు విశాఖపట్నం వస్తుంది. అలాగే విశాఖపట్నం-తిరుపతి-విశాఖపట్నం (18507/18508) రైలు కూడా రెగ్యులర్‌గా నడవనుంది.ఏప్రిల్ 3 నుంచి ప్రతి శుక్రవారం విశాఖపట్నం-చర్లపల్లి (18527) రైలు.. విశాఖపట్నంలో సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 8 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. ఏప్రిల్ 4 నుంచి ప్రతి శనివారం ఈ రైలు తిరుగు ప్రయాణంలో (18528) చర్లపల్లిలో మధ్యాహ్నం 2.30 గంటలకు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 5.20 గంటలకు విశాఖపట్నం వస్తుంది.ఏప్రిల్ 5 నుంచి ప్రతి ఆదివారం విశాఖపట్నం-బెంగళూరు (18509) రైలు విశాఖపట్నంలో మధ్యాహ్నం 3.20 గంటలకు బయలుదేరి మరుసటిరోజు మధ్యాహ్నం 1.50 గంటలకు బెంగళూరు వెళుతుంది. ఏప్రిల్‌ 6 నుంచి ప్రతి సోమవారం ఈ రైలు (18510) తిరుగు ప్రయాణంలో బెంగళూరులో మధ్యాహ్నం 3.50 గంటలకు బయలుదేరి మరుసటిరోజు మధ్యాహ్నం 1.30 గంటలకు విశాఖపట్నం చేరుతుంది. రైలు ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు సూచించారు.విశాఖపట్నం నుంచి ఈ మూడు రైళ్లు శాశ్వత ప్రాతిపదికన అందుబాటులోకి రానుండటంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు. విశాఖపట్నం నుంచి తిరుపతి, బెంగళూరు, హైదరాబాద్ వెళ్లేవారికి ఊరట దక్కనుంది. ముఖ్యంగా విశాఖపట్నం నుంచి తిరుపతికి రైలు అందుబాటులోకి రానుండటంతో.. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్లే భక్తులకు ఇబ్బందులు తొలగిపోతాయి అంటున్నారు.