'అది ప్రార్థనా స్థలం.. ఎవరి జాగీరు కాదు'.. ఢిల్లీ ఎయిర్‌పోర్టు ఘటనపై మాధవీలత కౌంటర్ కామెంట్స్

Wait 5 sec.

బీజేపీ మహిళా నేత కొంపెల్ల మాధవీలత వ్యవహరించిన తీరుపై ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎయిర్‌పోర్టులోని మహిళల ప్రార్థనా గదిలో ముస్లిం మహిళలు నమాజ్ చేసుకుంటున్న సమయంలో అక్కడకు చేరుకున్న మాధవీలత గట్టిగా దుర్గాస్తుతి పఠించింది. ఆమె దుర్గాస్తుతి పఠించే సమయంలో తన టీంతో వీడియోలు కూడా తీయించుకుంది. అందుకు సంబంధంచిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇతర మతస్థులు ప్రార్థనలు చేసుకుంటున్న చోట ఉద్దేశపూర్వకంగానే ఆమె ఇలా ప్రార్థనలు చేస్తూ వారిని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించారని పలువురు నెటిజన్లు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇతర మతస్థులను రెచ్చగొట్టే చర్యేనని కొందరు విమర్శిస్తుండగా.. మరికొందరు మాత్రం తమ తమ మతాలకు సంబంధించిన ప్రార్థనలు చేసుకునే హక్కు ఎక్కడైనా, ఎవరికైనా సమానంగా ఉంటుందని వాదిస్తున్నారు. ఈ విమర్శలపై తాజాగా మాధవీలత స్పందించారు. తనపై వస్తున్న విమర్శలకు కౌంటర్ కామెంట్స్ చేశారు. ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మట్లాడిన ఆమె.. అది పబ్లిక్ ప్రాపర్టీ అని ఎవరికైనా సమాన హక్కులు ఉంటాయని చెప్పారు. తాను వీడియో తీసుకోవటంలో తప్పేముందని ప్రశ్నించారు. ఇది లౌకిక ప్రజాస్వామ్య దేశమని అందరికీ సమాన హక్కులు ఉంటాయనే విషయాన్ని గమనించాలని విమర్శకులకు సూచించారు. 'అమెరికా, యూరప్ దేశాల్లో విమానం టేకాఫ్ అయ్యే ముందు, ల్యాండ్ అయ్యే ముందు ప్రార్థనలు చేస్తారు. ఏసును ప్రార్థిస్తూ.. గట్టిగా చప్పట్లు కొడతారు. మీరు మక్కాకు వెళ్లి వీడియోలు ఎలా తీసుకుంటారు? చాలా మంది సెలబ్రెటీలు మక్కాకు వెళ్తుంటారు. వాళ్లు ఫోటోలు, వీడియోలు తీసుకుంటుంటారు. మక్కాలో అది చేశాం.. ఇది చేశాం అని సోషల్ మీడియాలో పెడుతుంటారు కదా. ఎయిర్‌పోర్టులో ఉన్నది ప్రార్థనా స్థలం. ఇది ఎవరి జాగీరు కాదు. అది ప్రజల ప్రార్థనా స్థలం. భారతదేశం లౌకిక ప్రజాస్వామ్య దేశం. దేశంలో అందరికీ హక్కులు ఉంటాయి. నా వీడియోపై విమర్శలు చేసేముందు. మక్కాలో, జామా మసీదులో, రంజాన్ సమయంలో ఖురాన్ చదివే సమయంలో మీరు తీసుకునే వీడియోలకు సమాధానం చెప్పండి.' అని మాధవీలత కౌంటర్ ఇచ్చారు. కాగా, మాధవీలత నిత్యం ఇలాంటి చర్యలతో వార్తల్లో నిలుస్తుంటారు. 2024 హైదరాబాద్ బీజేపీ ఎంపీగా పోటీ చేసిన ఆమె.. ప్రచారంలో భాగంగా మసీదు వైపు బాణాన్ని వదిలినట్లు యాక్షన్ చేయటం అప్పట్లో వివాదానికి దారి తీసింది. ఆ తర్వాత పోలింగ్ బూతులో , ఇటీవల బంజారహిల్స్‌లో రంజాన్ ఇఫ్తార్ విందు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించటం వంటి చర్యలతో వివాదానికి కారణమయ్యారు.