‘నా సోదరుడి ప్రాణం తీసింది’.. రాహుల్ రామకృష్ణ ఆవేదన.. గడ్డి మందును వెంటనే నిషేధించాలని మోదీ, రేవంత్‌కు అభ్యర్థన

Wait 5 sec.

సినీ నటుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక విజ్ఞప్తి చేశారు. పారాక్వాట్ అనే కలుపు మందును బ్యాన్ చేయాలని కోరారు. ఈ కలుపు నివారిణి కారణంగా తన సోదరుణ్ని కోల్పోయానని రాహుల్ రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్లో ఎంతో సులభంగా దొరికే ఈ ప్రమాదకరమైన, ప్రాణాంతక క్రిమి సంహారక మందు ఆత్మహత్యకు పాల్పడటానికి వాడుతున్నారని, ఇది తీవ్రంగా దుర్వినియోగం అవుతోందని ఆయన తెలిపారు. ఈ కలుపు మందు తాగిన కేసులు భారీ సంఖ్యలో నమోదవుతుండటంతో డాక్టర్లు సైతం తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. దయచేసి వెంటనే ఈ పురుగు మందును నిషేధించి, ప్రాణాలను కాపాడండి అంటూ తెలంగాణ సీఎంవో, ప్రధానమంత్రి కార్యాలయాలను ట్యాగ్ చేస్తూ రాహుల్ రామకృష్ణ ఎక్స్‌లో పోస్టు చేశారు.పారాక్వాట్ అనేది అత్యంత విషపూరితమైన కలుపు మందు. పొలాల్లో కలుపు మొక్కలను సులభంగా నాశనం చేయొచ్చనే ఉద్దేశంతో రైతులు దీన్ని విరివిగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా పత్తి లాంటి మెట్ట పంటల్లో పెరిగే కలుపు, వరి పొలాల గట్ల మీదున్న గడ్డిని నాశనం చేయడానికి ఈ మందును ఉపయోగిస్తున్నారు. దీంతో ప్రతి రైతు ఇంట్లో ఇది అందుబాటులో ఉంటోంది.పారాక్వాట్ అత్యంత విషపూరితం..అయితే పారాక్వాట్ అత్యంత విషపూరితం కావడంతో.. కొద్ది మోతాదులో తీసుకున్నప్పటికీ ప్రాణాంతకంగా మారుతోంది. ఇళ్లలో గొడవలు జరిగినప్పుడు క్షణికావేశంలో ఈ మందు తాగిన ఎంతో ప్రాణాలు కోల్పోతున్నారు. వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్తేనే ఫలితం ఉంటోంది. ఈ మందు తాగిన వారు, ఆవేశం తగ్గిన తర్వాత తమను బతికించాలని డాక్టర్లను వేడుకున్నప్పటికీ, వైద్యులు వారిని కాపాడటానికి ఎంతగా శ్రమించినప్పటికీ ఫలితం ఉండటం లేదు. విష ప్రభావంతో వారు ప్రాణాలు వదులుతున్నారు.ఒకవేళ బతికినా సరే శరీరం లోపలి అవయవాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. పారాక్వాట్ చర్మం మీద పడినా, దీని వాసన పీల్చిన కూడా ప్రమాదకరమేనని డాక్టర్లు చెబుతున్నారు. తాగిన వారిని హాస్పిటల్‌కు తరలించే సమయంలో ఆక్సిజన్ పెట్టొద్దని డాక్టర్లు సూచిస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా హాస్పిటల్‌కు తరలిస్తే బతికే అవకాశాలు 25 శాతం వరకు ఉంటాయని చెబుతున్నారు. పురుగు మందు తాగారని ఎవరినైనా హాస్పిటల్‌కు తీసుకెళ్తే.. గడ్డి మందు తాగారా? అని డాక్టర్లు అడిగేంత స్థాయిలో ఈ కేసులు నమోదవుతున్నాయి.భారీ సంఖ్యలో మరణాలు..తెలంగాణలో ఈ కలుపు మందు తాగి ఏటా 5500 నుంచి 6 వేల మంది వరకు చనిపోతున్నారని అంచనా. దేశంలో ప్రతి నెలా ఇలాంటివి దాదాపు 1000 కేసులు నమోదవుతున్నాయని ఇండియన్ మెడికల్ అసోసియేషన్, డాక్టర్స్ ఎగైనెస్ట్ పారాక్వాట్ పాయిజన్ అనే సంస్థలు చెబుతున్నాయి. దీంతో ఈ గడ్డి మందును నిషేధించాలనే డిమాండ్ ఊపందుకుంది. గడ్డి మందును విక్రయించడానికి డీలర్లు ప్రత్యేక రిజిస్టర్ నిర్వహించాలని.. మండల వ్యవసాయ అధికారుల సిఫారసుతోనే దీన్ని విక్రయించేలా చూడాలని కొందరు కోరుతున్నారు.