కొత్త పార్టీకి ముహూర్తం ఫిక్స్.. ఏప్రిల్ 25న ప్రారంభించనున్నట్లు తెలిపిన కవిత

Wait 5 sec.

తెలంగాణ గడ్డపై మరో కొత్త పార్టీ ఏర్పాటుకు రంగం సిద్ధం అయింది. ఎప్పటి నుంచో పార్టీ పెట్టనున్నట్లు తెలిపిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ .. తాజాగా దానికి సంబంధించి కీలక విషయాలను వెల్లడించారు. పార్టీ ఆవిర్భావం, జెండా, అజెండా, విధి విధానాలను ఏప్రిల్ 25వ తేదీన వెల్లడిస్తామని.. తాజాగా కవిత స్పష్టం చేశారు. ఏప్రిల్ 25వ తేదీన మంచి ముహూర్తం ఉందని.. అందుకే ఆ రోజున పార్టీని ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. శ్రీరామనవమి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు చెప్పిన కల్వకుంట్ల కవిత.. తన సొంత రాజకీయ పార్టీపై తాజాగా నిజామాబాద్‌ జాగృతి కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి కీలక ప్రకటన చేశారు. ఇక తన పార్టీని ఎక్కడ ప్రారంభించేది అనే విషయాన్ని కూడా కల్వకుంట్ల కవిత వెల్లడించారు. హైదరాబాద్ నగర శివారులోని మేడ్చల్‌ జిల్లా మునీరాబాద్ గ్రామంలోని అద్వయ కన్వెన్షన్‌ హాల్‌లో భారీ సభను ఏర్పాటు చేసి ముహూర్తం ప్రకారం ఉదయం 10 గంటలకు పార్టీ ఆవిష్కరణ, జెండా విడుదల చేయనున్నట్లు కవిత స్పష్టం చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ నంబర్ 6 వద్ద ఉన్న 20 ఎకరాల భారీ స్థలంలో ఈ సభను నిర్వహించనున్నట్లు కవిత స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పార్టీ ఏర్పాటుకు సంబంధించి.. ఏప్రిల్ 25వ తేదీ లోపు సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తామని కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఇక తాము ఎవరి నుంచైనా సలహాలు, సూచనలు స్వీకరిస్తామని.. దానికి సంబంధించిన వాట్సాప్ నంబర్‌ను కూడా త్వరలోనే ఇస్తామని వెల్లడించారు. ఇక తమ పార్టీ ఆవిర్భావ సభకు నాయకులు, తెలంగాణ జాగృతి కార్యకర్తలు, తెలంగాణ ప్రజలు భారీ ఎత్తున తరలిరావాలని కవిత విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో మార్పు కావాలని కోరుకునే వారంతా తనతో కలిసి రావాలని ఆమె కోరారు. ఈ నేపథ్యంలోనే తమ కొత్త పార్టీలో.. కొత్త తరం నాయకత్వానికి, మరీ ముఖ్యంగా మహిళా సాధికారతకు పెద్దపీట వేయనున్నట్లు కవిత స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమ కారుల ఆశయాలకు అనుగుణంగా.. ప్రొఫెసర్ జయశంకర్ మార్గంలో తమ పార్టీ పనిచేస్తుందని కవిత వెల్లడించారు. ఇక నిజామాబాద్‌ కోడలిగా పార్టీ ప్రకటనకు సంబంధించిన విషయాన్ని అక్కడ చెప్పానని పేర్కొన్న కవిత.. ఎన్నికల్లో ఎక్కడ పోటీ చేయాలి అనే విషయంపై పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత క్లారిటీ ఇస్తామని చెప్పారు.