ఆకివీడు: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు రామాలయ సందర్శనలో ఉద్రిక్తత..కొంతమందికి గాయాలు!

Wait 5 sec.

పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. శ్రీరామనవమి సందర్భంగా పెదపేటలోని రామాలయం సందర్శనకు వెళ్లిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును అడ్డుకునేందుకు కొంతమంది ప్రయత్నించటం ఉద్రిక్తతకు కారణమైంది. అయితే వీరిని.. కూటమి కార్యకర్తలు, నేతలు అడ్డుకోవటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇరువర్గాల మధ్య వాగ్వాదం కాస్తా.. ఘర్షణకు దారితీసింది. ఈ దాడిలో కొంతమందికి గాయాలయ్యాయి. గాయపడినవారిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. గ్రామంలో భారీగా మోహరించారు. అయితే ఘర్షణ తలెత్తడానికి ముందే ఉండి ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆయన వెళ్లిన తర్వాత కూటమి కార్యకర్తలపై కొంతమంది దాడికి పాల్పడినట్లు తెలిసింది. ఈ దాడిలో కూటమి కార్యకర్తలకు గాయాలు కాగా.. వారిని ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ఈ ఘటనపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు స్పందించారు. కొద్దిలో తాను తప్పించుకున్నానని అన్నారు. దాడికి కారణమైనవారిని గుర్తించి.. కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. "నేను కొద్దిలో తప్పించుకున్నా. త్రుటిలో మిస్ అయ్యా. నేను బయల్దేరిన మరుక్షణం.. మేకులు, చాకులు, కత్తులు, రాళ్లతో దాడి చేశారు. ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారం మాపై దాడి చేశారు. శ్రీరామనవమి రోజు కూడా వందేళ్ల చరిత్ర ఉన్న రామాలయంలో పూజలు చేయడానికి వీల్లేదనే దారుణమైన పరిస్థితి వచ్చింది. ఇలాంటి పరిస్థితిని ఆదిలోనే అరికట్టాల్సిన అవసరం ఉంది. దాడి చేసిన వారి విజువల్స్ ఉన్నాయి. పోలీసులు పరిశీలిస్తున్నారు. దాడి చేసిన వారిని గుర్తించాం. హత్యాప్రయత్నం చేసిన వారిపై కేసులు పెట్టి, కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం" అని రఘురామకృష్ణరాజు కోరారు. మరోవైపు పెదపేటలో తమ నివాసాల మధ్య రఘురామకృష్ణరాజు బలవంతంగా రామాలయం నిర్మించారని మరో వర్గం చెప్తోంది. ఈ క్రమంలోనే పూజలు చేసేందుకు వెళ్లిన రఘురామకృష్ణరాజును అడ్డుకునేందుకు కొంతమంది యత్నించారు. అయితే పోలీస్ బందోబస్తు మధ్య ఆయన స్వామి దర్శనం చేసుకుని, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అయితే ఆయన అక్కడి నుంచి బయల్దేరి వెళ్లిన కాసేపటికే ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.