ఏపీలో నిలువునా ఎండిపోతున్న వేపచెట్లు.. కారణం ఇదేనట

Wait 5 sec.

ప్రతి ఏటా ఉగాదికి వేపచెట్ల పూతతో పచ్చిడి చేస్తుంటారు.. అలాంటిది ఈ ఏడాది వేపచెట్ల పరిస్థితి మారిపోయింది. ఆంధ్రప్రదేశ్‌లో వేప చెట్లు నిలువునా ఎండిపోతున్నాయి.. ఆకులు, కొమ్మలు ఎండిపోయి కిందపడిపోతున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వేపచెట్లు ఎండిపోవడాన్ని చూసి జనాలు ఆందోళనలో ఉన్నారు. అయితే ఈ వేపచెట్లకు తెగులు సోకినట్లు చెబుతున్నారు.. డైబ్యాక్‌ అనే ఫంగస్ వల్ల వేపచెట్లు ఇలా ఎండిపోతున్నాయని వైఎస్సార్‌ ఉద్యాన విశ్వవిద్యాలయ ఉద్యాన శాస్త్రవేత్తలు తెలిపారు. అలాగే టీ దోమ అనే కీటకం కూడా కారణమని.. ఈ తెగులు సోకితే చెట్టు పైభాగం కొమ్మల వరకు ఇలాగే ఎండిపోతాయంటున్నారు. వేపచెట్లకు అసలు గింజ ఉత్పత్తి ఉండదంటున్నారు. ఈ కారణంగానే వేప చెట్లు ఎండిపోతున్నాయన్నారు. ఎక్కడైనా వేపచెట్లు ఇలా ఎండిపోతే.. చెట్టులో ఎండిన చోట నుంచి 15 సెంటీమీటర్లు కిందకు కొమ్మ ఆరోగ్యంగా ఉన్నచోట వరకు కత్తిరించాలని సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు. అలా కత్తిరించిన కొమ్మల్ని తీసుకెళ్లి తగలబెట్టాలని.. లేకపోతే ఆ డైబ్యాక్ మళ్లీ గాలి ద్వారా మిగిలిన చెట్లకు వేగంగా వ్యాపిస్తుందంటున్నారు. అలాగే వేపచెట్లకు ఒక గ్రాము కార్రబెండాజిమ్, రెండు మిల్లీలీటర్ల ప్రొఫెనోఫాస్‌ను లీటర్ నీళ్లలో కలిపి వేప చెట్టు చిగుళ్లు, కొమ్మలు తడిచేలా పిచికారీ చేయాలని సూచిస్తున్నారు ఉద్యాన శాస్త్రవేత్తలు. అలాగే చెట్టు మొదట్లో వేప పిండి, సేంద్రీయ ఎరువులు వేయడం మంచిదని సూచిస్తున్నారు. వేప చెట్టు కింద రాలిన ఆకలుతో సాయంత్రం వేళ పొగ వేస్తే చెట్టు ఎండిపోవడానికి కారణమైన టీ దొమల్ని కూడా నియంత్రించవచ్చని సూచనలు చేస్తున్నారు.1990లలో ఉత్తరాఖండ్ ప్రాంతంలో ఈ డైబ్యాక్‌ వ్యాధిని కనిపెట్టారు. ఆ తర్వాత దేశంలోని పలు ప్రాంతాల్లో కనిపించింది.. ఇప్పుడు ఏపీలో కూడా ఈ డైబ్యాక్ కనిపిస్తోంది. ఈ ఫంగస్ కారణంగా చెట్టుకు పోషకాలు ఆగిపోతాయి. టీ దోమ కొమ్మల్లో ఉండే రసాన్ని పీల్చడంతో.. ఆ ఫంగస్ చెట్టులోపలికి వెళ్లి ఎండిపోతుంది. ఒకవేళ ఈ ఫంగస్‌ను పట్టించుకోకుండా వదిలేస్తే వేప చెట్లను నాశనం చేస్తుందని.. వేప గింజల ఉత్పత్తి ఆగిపోతుందంటుననారు. అందుకే ఉద్యాన శాస్త్రవేత్తలు నివారణ మార్గాలను సూచిస్తున్నారు.