చెన్నై సూపర్ కింగ్స్ నుంచి రాజస్థాన్ రాయల్స్‌లోకి వచ్చిన రవీంద్ర జడేజానే సీఎస్కే పతనాన్ని శాసించాడు. మొదటి మ్యాచ్‌లోనే జడ్డూ అంటే ఏంటో చూయించాడు. గువాహటి వేదికగా జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే ఘోర పరాజయం పాలవగా.. రాజస్థాన్ రాయల్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. సీఎస్కే ఓటమిలో జడ్డూ పాత్ర చాలా కీలకంగా మారింది. ఐపీఎల్ 2026 మూడో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ - చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన రియాన్ పరాగ్ బౌలింగ్ ఎంచుకోవడంతో, సీఎస్కే తొలుత బ్యాటింగ్‌కి రావాల్సి వచ్చింది. రాజస్థాన్ పేసర్లు జోఫ్రా ఆర్చర్, బర్గర్ టాప్ ఆర్డర్‌ను కుప్పకూల్చడంతో పవర్ ప్లేలోనే సీఎస్కే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ అటాకింగ్ బ్యాటింగ్‌తో రాజస్థాన్ రాయల్స్ బౌలర్లపై ఎదురుదాడి చేశాడు. సరిగ్గా అదే సమయంలో కెప్టెన్ రియాన్ పరాగ్ బంతిని స్పెషలిస్ట్ ఆల్‌రౌండర్ చేతికి ఇచ్చాడు. 8వ ఓవర్‌లో బౌలింగ్‌కి వచ్చిన జడేజా రెండో బంతికే దూకుడుగా ఆడుతున్న సర్ఫరాజ్‌ను ఎల్‌బీడబ్ల్యూ చేశాడు. అదే ఓవర్‌లో క్రీజులోకి వచ్చిన శివమ్ దూబే తొలి బంతినే సిక్సర్‌గా మలిచాడు. దాంతో ట్రాక్ మార్చిన జడ్డూ ఆఖరి బంతికి వికెట్ తీశాడు. జడేజా వేసిన ఈ ఓవర్‌తో సీఎస్కే పతనం ఖరారయింది. ఎందుకంటే సర్ఫరాజ్ నిలకడా ఆడుతూ పరుగులు రాబడుతుండగా, దూబే క్రీజులో కుదురుకుని ఉంటే చెన్నై భారీ స్కోర్ చేసుండేది. కానీ.. ఇద్దర్నీ ఒకే ఓవర్‌లో అవుట్ చేసి సీన్ రివర్స్ చేశాడు. దూబే అవుటైన తర్వాత పిస్టోల్ పేల్చినట్టు జడ్డూ చేసిన సెలబ్రేషన్ వైరల్ అయింది. ఇక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 19.4 ఓవర్లలో 127 పరుగులకే ఆలౌట్ అయింది. ఈజీ టార్గెట్‌తో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించి 12.1 ఓవర్లలోనే ఆట ముగించింది. యంగ్ డైనమైట్ వైభవ్ సూర్యవంశీ కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి చెలరేగాడు. గతేడాది ఆఖరి స్థానంలో నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్, ఇప్పుడు కూడా అదే ఆట తీరు కొనసాగించడంతో అభిమానులు నిరాశలో మునిగిపోయారు.