దేశంలోనే టాప్ విశ్వవిద్యాలయాల్లో ఉస్మానియా యూనివర్సిటీ ఒకటి. నిలుస్తుంది. అలాంటి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పరిశోధక విద్యార్థుల (పీహెచ్‌డీ) దుస్థితిపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) నివేదిక‌లో విస్తుపోయే నిజాలను వెలుగులోకి వచ్చాయి. కొంతమంది విద్యార్థులు తమ పీహెచ్‌డీ పూర్తి చేయడానికి జీవితకాలం తీసుకున్నారు. డాక్టరేట్ పొందేందుకు ఏకంగా 30 ఏళ్ల సమయం తీసుకున్నారని.. ఇది యూనివర్సిటీ నిబంధనలకు విరుద్ధమని కాగ్ తప్పుబట్టింది. సోమవారం ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఇక 2017-18 నుంచి 2022 మధ్య కాలంలో డిగ్రీలు పొందిన వారిలో సుమారు 57 శాతం మంది నిర్ణీత గడువు కంటే ఎక్కువ సమయం తీసుకున్నట్లు వెల్లడైంది.యూనివర్సిటీ నిబంధనల ప్రకారం.. ఫుల్‌టైమ్ పీహెచ్‌డీ స్కాలర్లు గరిష్టంగా ఆరేళ్లలో (4 ఏళ్లు + 2 ఏళ్ల పొడిగింపు), పార్ట్‌టైమ్ స్కాలర్లు ఆరేళ్లలో (5 ఏళ్లు + 1 ఏడు పొడిగింపు) తమ పరిశోధన పూర్తి చేయాలి. అయితే, మొత్తం 2,887 మంది స్కాలర్లలో కేవలం 1,222 మంది మాత్రమే నిర్ణీత గడువులోగా పూర్తి చేశారు. మిగిలిన 1,665 మందిలో 10 మంది విద్యార్థులు డాక్టరేట్ పట్టా పొందడానికి 26 నుంచి 30 ఏళ్లు తీసుకున్నారు. అలాగే 25 మందికి 21-25 ఏళ్లు, 86 మందికి 16-20 ఏళ్లు, 369 మందికి 11-15 ఏళ్ల సమయం పట్టింది. తెలంగాణ ఉద్యమం, కొవిడ్-19 మహమ్మారి కారణంగా విద్యార్థుల విజ్ఞప్తి మేరకు 'వన్ టైమ్ రిలాక్సేషన్' కింద గడువు పెంచినట్లు ప్రభుత్వం, వర్సిటీ వైస్ ఛాన్సలర్ కుమార్ వివరణ ఇచ్చారు.మరోవైపు, ఓయూలో పరీక్షల నిర్వహణలో తీవ్రమైన లోపాలు ఉన్నట్లు కాగ్ గుర్తించింది. సుమారు 1.5 లక్షల జవాబు పత్రాలు స్టాక్ రిజిస్టర్‌లో నమోదు కాలేదని, వీటి విలువ సుమారు రూ. 10.60 లక్షలని నివేదికలో పేర్కొంది. ఇలా అకౌంట్‌లో లేని పేపర్లు పరీక్షల్లో అక్రమాలకు దారితీసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. పరీక్షా కేంద్రాలకు పంపిన అదనపు పేపర్లు తిరిగి రాకపోవడం వల్ల సప్లిమెంటరీ పరీక్షల్లో వీటిని దుర్వినియోగం చేసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అకడమిక్ అంశాల నుంచి హాస్టల్ నిర్వహణ వరకు ప్రతి విభాగంలోనూ లోపాలు ఉన్నట్లు ఆడిట్ నివేదిక స్పష్టం చేస్తోంది. యూనివర్సిటీకి వచ్చిన నిధులు సకాలంలో వినియోగించుకోకపోవడం వల్ల కోట్లాది రూపాయల గ్రాంట్లు వెనక్కి వెళ్ళిపోయాయని తెలిపింది. దాదాపు రూ.18.78 కోట్ల అభివృద్ధి నిధులు ఖర్చు చేయకుండానే మిగిలిపోయాయని తెలిపింది. శతాబ్ది ఉత్సవాల కోసం కేటాయించిన రూ.3.96 కోట్లను ఇతర అవసరాలకు మళ్లించారని... అలాగే మరో రూ.5.04 కోట్ల శతాబ్ది నిధులు రద్దయినట్లు చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా కనీస అర్హతలు లేని 82 మందిని ప్రోఫెసర్లుగా నియమించినట్లు నివేదిక పేర్కొంది. విద్యార్థుల వసతి సౌకర్యాల విషయంలో లోపాలున్నాయని.. 28 హాస్టళ్లలో 10 హాస్టళ్లు వాటి సామర్థ్యం కంటే ఎక్కువగా దాదాపు103 - 314 శాతం ఆక్యుపెన్సీతో కిక్కిరిసిపోయినట్లు గుర్తించింది. ఉస్మానియా వంటి చారిత్రక విశ్వవిద్యాలయంలో ఇన్ని లోపాలు బయటపడటం విద్యా వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. అధికారులు ఇప్పటికైనా స్పందించి ఈ లోపాలను సరిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.