భక్తులకు పండగలాంటి వార్త.. ఏపీలో మూడుచోట్ల గిరి ప్రదక్షిణ మార్గాలు..

Wait 5 sec.

భక్తులకు డిప్యూటీ సీఎం శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో మూడుచోట్ల గిరి ప్రదక్షిణ మార్గాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే శ్రీకాళహస్తి గిరి ప్రదక్షిణ మార్గాన్ని ఇప్పటికే అందుబాటులోకి తెచ్చామని.. మార్గాన్ని నేడు (మార్చి 25) ప్రారంభించినట్లు తెలిపారు. కోటప్పకొండ గిరిప్రదక్షిణ మార్గంలో రోడ్డు మంజూరు చేశామని.. త్వరలోనే దానిని కూడా ప్రారంభిస్తామని వెల్లడించారు. ఆలయాల అభివృద్ధి, హిందూ ధర్మ పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. దేవాలయాల పవిత్రతను కాపాడటం సహా.. దేశ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షిస్తామని అన్నారు. విజయనగరం జిల్లా నెలిమర్ల నియోజకవర్గంలోని రామతీర్థం గిరి ప్రదక్షిణ మార్గాన్ని బుధవారం రోజున పవన్ కళ్యాణ్ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. సీతారాముని పేట కూడలి నుంచి నీలాచలం కొండ వరకు3.70 కిలోమీటర్ల మేర ఈ రహదారిని నిర్మించారు. ఇందుకోసం రూ.3.40 కోట్ల ఉపాధి హామీ నిధులు ఖర్చు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్.. భారతదేశంలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో రామతీర్థం ఒకటని అన్నారు. రామతీర్థంలో రామాయణ, మహా భారత కాలం నాటి ఆనవాళ్లు ఉన్నాయని అన్నారు. పవిత్రమైన రామతీర్ధం కొండ చుట్టూ గిరిప్రదక్షిణ చేస్తే ముక్తిని పొందుతారని భక్తులు నమ్ముతారని.. అందుకే వైకుంఠ ఏకాదశి, శివరాత్రి పర్వదినాల్లో వేలమంది భక్తులు రామతీర్ధంలో గిరిప్రదక్షిణ చేసి మొక్కులు తీర్చుకుంటారని అన్నారు. రామతీర్థం గిరి ప్రదక్షిణ మార్గం గతంలో ముళ్లూ, రాళ్లు, రప్పలతో ఉండేదన్న పవన్ కళ్యాణ్.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలయాల పవిత్రతను సంరక్షించే చర్యలు చేపట్టిందన్నారు. అందులో భాగంగానే రామతీర్ధం కొండ చుట్టూ రోడ్డు నిర్మించే బాధ్యత తీసుకున్నామని.. ఉపాధి హామీ నిధుల వెచ్చించి బీటీ రోడ్డు ఏర్పాటు చేశామని వివరించారు.శ్రీరామ నవమికి రెండు రోజుల ముందే రోడ్డును అందుబాటులోకి తెచ్చినట్లు పవన్ కళ్యాణ్ వెల్లడించారు. గత 20 నెలల్లో రూ. 40 కోట్లకు పైగా నిధులు ఖర్చుచేసి, రాష్ట్రంలోని 22 ప్రధాన ఆలయాలకు రోడ్ల సౌకర్యం కల్పించామని వివరించారు. మహా శివరాత్రికి ముందు శ్రీకాళహస్తిలో గిరిప్రదక్షిణ మార్గం ప్రారంభించామని.. కోటప్పకొండకు రోడ్డు మంజూరు చేసినట్లు వెల్లడించారు. తాజాగా రాములవారి భక్తుల కోసం రామతీర్ధంలో గిరిప్రదక్షిణ రోడ్డుని అందుబాటులోకి తెచ్చినట్లు పవన్ కళ్యాణ్ వివరించారు. స్వామిని ఈ రూపంలో సేవించుకునే భాగ్యం కలగడం అదృష్టంగా భావిస్తున్నానని పవన్ కళ్యాణ్ సంతోషం వ్యక్తం చేశారు.