హోటళ్లు, రెస్టారెంట్లపై కేంద్రం సీరియస్.. 'గ్యాస్' ఛార్జీలు వసూలు చేయొద్దని హెచ్చరిక!

Wait 5 sec.

LPG Charges: ఆహార ప్రియులకు గ్యాస్ ఛార్జీల నుంచి ఉపశమనం లభించింది. హోటళ్లు, రెస్టారెంట్లు వసూలు చేస్తున్న అదనపు గ్యాస్ ఛార్జీలపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. అలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయవద్దని హెచ్చరికలు జారీ చేసింది. అదనపు బాదుడును కట్టడి చేయాలంటూ చాలా మంది వినియోగదారులు ఫిర్యాదులు చేసిన క్రమంలో ఈ సమస్యపై కేంద్ర ప్రత్యేక దృష్టి సారించింది. అలాంటి ఛార్జీలు వసూలు చేయవద్దని స్పష్టం చేసింది. ఇటీవల పాపులర్ రెస్టారెంట్లలో ఆహారం తిన్న చాలా మంది కస్టమర్లకు ఎల్‌పీజీ ఛార్జీలపై ఆందోళన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలో కేంద్ర వినియోగదారుల పరిరక్షణ అథారిటీ (CCPA) చర్యలు చేపట్టింది. ఎల్‌పీజీ గ్యాస్ కొరతను సాకుగా చూపించి ఎల్‌పీజీ ఛార్జీలు, ఇంధన వ్యయం పేరుతో అదనంగా వసూలు చేయడం చట్ట విరుద్ధమని సీసీపీఏ స్పష్టం చేసింది. అదనంగా సర్వీస్ ఛార్జీ వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హోటళ్లు, రెస్టారెంట్లను హెచ్చరించింది. ఈ మేరకు బుధవారం పత్రికా ప్రకటన జారీ చేసింది. హోటళ్లు, రెస్టారెంట్లు అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులు అందుతున్న క్రమంలో ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నట్లు సీసీపీఏ తెలిపింది. చాలా హోటళ్లు ఎల్‌పీజీ ఛార్జీలు లేదా గ్యాస్ సర్‌ఛార్జీలు లేదా ఫ్యూయల్ కాస్ట్ రికవరీ ఛార్జీలు అంటూ బిల్లులో అదనపు వసూలు చేస్తున్నట్లు గుర్తించినట్లు పేర్కొంది. అలాంటి అదనపు వసూలుకు పాల్పడితే కన్సూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 కింద చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ' ఫిర్యాదులు పెరిగాయి. అలాగే మీడియాల్లోనూ ఈ గ్యాస్ ఛార్జీలపై వార్తలు వస్తున్నాయి. మెనూలో పేర్కొన్న వాటికంటే అదనంగా వసూలు చేయవద్దు. అందులో పేర్కొన్న ఛార్జీలే తుది ధరలు. వాటి పైన అదనపు ఛార్జీల పేరుతో వినియోగదారులను ఇబ్బంది పెట్టకూడదు. వినియోగదారుల పరిరక్షణ చట్టం మార్గదర్శకాలను ఉల్లంఘించినట్లు తెలిస్తే చర్యలు తప్పవు' అని సీసీపీఏ హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం రోజు రోజుకు తీవ్రమవుతున్న క్రమంలో దేశంలో ఎల్‌పీజీ కొరత ఏర్పడింది. దీంతో హోటళ్లు, రెస్టారెంట్ల వంటి కమెర్షియల్ సరఫరాపై కేంద్రం పరిమితిలు విధించింది. అలాగే సిలిండర్ ధరలను సైతం పెంచింది. ఈ క్రమంలో బ్లాక్‌లో ఒక్కో సిలిండర్ ధర రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు విక్రయిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ సాకుతో చాలా హోటళ్లు, రెస్టారెంట్లు గ్యాస్ ఛార్జీలను నేరుగా బిల్లుల్లో వేసి వసూలు చేసినట్లు చాలా మంది వినియోగదారులు బిల్లు ఫొటోలతో పాటు సోషల్ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే సీసీపీఏ చర్యలు చేపట్టింది.