ఎమోషనల్ కాదు.. ఇలా చేస్తే బావుంటుంది.. ఏపీ ప్రభుత్వానికి విజయసాయిరెడ్డి సలహాలు

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చట్టబద్ధతపై అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపించారు. కేంద్ర కేబినెట్ అమరావతికి చట్టబద్ధత కల్పించే విషయంలో తీర్మానం చేయనున్నట్లు తెలుస్తోంది. అమరావతికి చట్టపరమైన ఇబ్బందులు రాకుండా కేంద్రం చర్యలు చేపట్టింది.. సీఆర్డీఏ-2014 తీర్మానాన్ని సవరించాలని ఆంధ్రప్రదేశ్‌కు సూచించింది. అందుకే అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించి మరీ తీర్మానం చేశారు. అయితే ఈ తీర్మానంపై మాజీ ఎంపీ ఆసక్తికర ట్వీట్ చేశారు. ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలు సంధిస్తూనే.. కొన్ని సలహాలు కూడా ఇచ్చారు.'ఒక రైతుగా అడుగుతున్నా. నా అమరావతి రైతు సోదరుల కోసం అధికారపార్టీని అడుగుతున్నా. 2015లో ల్యాండ్‌ పూలింగ్‌కు భూములు ఇచ్చిన రైతుల్లో ఎవరైనా వారికి కేటాయించిన ప్లాట్‌లో ఇల్లు కట్టుకోగలిగారా? అంటూ ప్రశ్నించారు. వారిలో ఏ ఒక్క రైతు అయినా వారికి ఇచ్చిన కమర్షియల్‌ స్థలంలో ఒక షాపింగ్‌ కాంప్లెక్స్‌ కట్టగలిగారా?.. ఈ 11 ఏళ్ళ కాలంలో వారికి కేవలం ఏడాదికి ఇంత అని నామమాత్రంగా డబ్బు ఇవ్వటం వల్ల కలిగిన లాభం ఏమిటి?' అని ప్రశ్నించారు. అసెంబ్లీలో రైతుల త్యాగాలు వెల కట్టలేనివి పలువురు సభ్యులు చెప్పారని.. ఈ ఎమోషనల్‌ డైలాగుల వల్ల రైతులకు న్యాయం జరగదన్నారు. ఇప్పటికైనా భూములు ఇచ్చిన రైతులకు గతంలో ఇస్తామన్న ఇళ్ల స్థలం, కమర్షియల్‌ స్థలం ఇవ్వాలన్నారు విజయసాయిరెడ్ి. వీటితో పాటుగా అదనంగా ఫెయిర్ కాంపెన్సేషన్ చట్టం 2013 ప్రకారం నష్ట పరిహారం కూడా ఇవ్వాలన్నారు. అసైన్డ్‌ భూముల విషయంలో ఒరిజినల్‌ అసైనీలకే నష్ట పరిహారం ఇవ్వాలని సూచించారు. గత ప్రభుత్వం నిరుపేదలకు కేటాయించిన 50 వేల ఇళ్ల పట్టాలను రద్దు చేశారని.. ఆ ప్లాట్లను ఆ నిరుపేదలకే తిరిగి ఇవ్వాలని కోరారు. ఒకవైపు రాజధానిని లక్షల కోట్లతో కడతామటున్నారని.. అది మంచిదేనని, కానీ ఆ భూములు ఇచ్చిన రైతులకే న్యాయం చేయకపోతే ఎలా అన్నారు. అమరావతిలో నిర్మించే భారీ భవనాల పునాదులు ఎవరి భూముల్లో నిర్మిస్తున్నారో వారికే సంతృప్తి, సంతోషం కలగకపోతే.. అలా నిర్మించే రాజధాని వల్ల ఏ ధనికులకి, బూర్జువాలకి లాభం కలుగుతుందని.. ఈ విషయంపై ప్రజలు కూడా ఆలోచన చేస్తారని గమనించాలన్నారు విజయసాయిరెడ్డి. వైఎస్సార్‌సీపీ రాజ్యసభ ఎంపీగా ఉన్న విజయసాయిరెడ్డి ఇటీవల పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేశారు.. రాజకీయాలకు దూరంగా ఉంటానని, వ్యవసాయం చేసుకుంటానని చెప్పుకొచ్చారు. అయితే అప్పుడప్పుడు తాజా రాజకీయ పరిణామాలపై ఆయన ట్వీట్‌లు చేస్తున్నారు. అయితే విజయసాయిరెడ్డి అవసరమైతే మళ్లీ పొలిటికల్ ఎంట్రీ ఇస్తానని చెప్పుకొచ్చారు.. ఈ క్రమంలో ఆయన ఏ పార్టీలో చేరతారనే చర్చ జరుగుతోంది. విజయసాయిరెడ్డి బీజేపీలో చేరతారనే ప్రచారం కూడా ఉంది.