ఐపీఎల్‌లో తన పేరుపై కొత్త రికార్డు లిఖించుకున్నాడు. హిట్‌మ్యాన్ బ్యాట్ పదునెక్కితే రికార్డులు వాటంతట అవే బద్దలవుతాయని మరోసారి సాటి చెప్పాడు. రోహిత్ శర్మ పవర్‌ఫుల్ బ్యాటింగ్‌తో ముంబై ఇండియన్స్‌ను వెంటాడుతున్న ఓ శాపానికి కూడా విముక్తి కలిగింది. ఆరంభ మ్యాచ్‌లో ఇప్పటి వరకు గెలుపు లేని ముంబై.. తొలిసారి విజయాన్ని నమోదు చేసింది. అదేవిధంగా రోహిత్ కూడా హాఫ్ సెంచరీలలో కొత్త మైలురాయిని అందుకున్నాడు. ఐపీఎల్ 2026లో భాగంగా ముంబై ఇండియన్స్ - కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో పరుగుల వరద పారింది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ 220 పరుగులు చేసింది. కెప్టెన్ అజింక్య రహానే 40 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 67 పరుగులు చేయగా.. ఫిన్ అలెన్ 17 బంతుల్లో 37 పరుగులు బాదాడు. అంగ్‌క్రిష్ రఘువంశీ 29 బంతుల్లో 51, రింకూ సింగ్ 21 బంతుల్లో 33 పరుగులు చేయడంతో 220 పరుగులు చేసింది. కామెరూన్ గ్రీన్ 18 పరుగులతో నిరాశ పరిచాడు. భారీ టార్గెట్ ఛేజింగ్‌తో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ జట్టుకు ర్యాన్ రికెల్టన్ - రోహిత్ శర్మ అద్భుత ఆరంభం ఇచ్చాడు. హిట్‌మ్యాన్ 38 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 78 పరుగులు చేయగా.. ర్యాన్ రికెల్టన్ 43 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్సర్లతో 81 పరుగులు చేశాడు. ఈ ఇద్దరూ తొలి వికెట్‌కు 148 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో ముంబై ఇండియన్స్ జట్టు 19.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసి ఓ కొత్త మైలురాయిని అందుకున్నాడు. 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని, తన కెరీర్‌లోనే ఫాస్టెస్ట్ ఫిఫ్టీతో రికార్డు సృష్టించాడు. అదేవిధంగా 50+ స్కోర్లను 50 సార్లు చేసి రికార్డు సృష్టించాడు. ఈ లిస్టులో విరాట్ కోహ్లి 72 హాఫ్ సెంచరీలతో టాప్ ప్లేస్‌లో నిలిచాడు. ఆ తర్వాత స్థానంలో డేవిడ్ వార్నర్ 66, శిఖర్ ధావన్ 53, రోహిత్ 50తో వరుసగా నిలిచారు.