ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు జరిగిన మినీ వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంఛైజీ కామెరూన్ గ్రీన్‌ను రూ. 25.2 కోట్లకు కొనుగోలు చేసింది. దాంతో ఈ సీజన్‌లో కేకేఆర్‌కు ఓ మంచి ఆల్‌రౌండర్ దొరికాడని అందరూ అనుకున్నారు. కానీ, కోల్‌కతా ఆశలపై నీళ్లు చల్లింది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆరుగురు కేకేఆర్ బౌలర్లు బౌలింగ్ చేసినా.. గ్రీన్‌కు ఒక్క ఓవర్ కూడా ఇవ్వలేదు. దానికి అసలు కారణం కెప్టెన్ చెప్పేశాడు. వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు 220 పరుగులు చేసినప్పటికీ ఓటమిపాలయింది. దీనికి ప్రధాన కారణం కేకేఆర్ బౌలింగ్ వైఫల్యం. రోహిత్ శర్మ - ర్యాన్ రికెల్టన్ దూకుడుకు కళ్లెం వేయలేకపోవడంతో పాటు 12వ ఓవర్ వరకూ తొలి వికెట్ తీయలేకపోయారు. ముగ్గురు స్పిన్నర్లు, ముగ్గురు పేసర్లు ప్రయోగించిన కేకేఆర్ చేతికి బంతిని మాత్రం ఇవ్వలేదు. కామెరూన్ గ్రీన్‌కి ఎందుకు బౌలింగ్ ఇవ్వలేదు అన్న ప్రశ్నకి కెప్టెన్ అజింక్య రహానే చాలా తెలివిగా సమాధానం చెప్పాడు. నవ్వుతూనే క్రికెట్ ఆస్ట్రేలియాను కార్నర్ చేశాడు. ప్రజంటేషన్ సమయంలో కామెంటేటర్ అడిగిన ప్రశ్నకు మీరు ఆ ప్రశ్న క్రికెట్ ఆస్ట్రేలియాను అడగాలి అంటూ నవ్వేశాడు. దాంతో కామెరూన్ గ్రీన్ విషయంలో క్రికెట్ ఆస్ట్రేలియా షరతులు పెట్టిందని అందరికీ అర్థమయింది. "గ్రీన్ త్వరలోనే కొద్ది కొద్దిగా బౌలింగ్ చేయడం ప్రారంభిస్తాడని ఆశిస్తున్నాం. మేం బ్యాటింగ్ మాత్రం అద్భుతంగా చేసినా.. బౌలింగ్ విషయంలో కాస్త తడబడ్డాం. 'గ్రీన్ ఎందుకు బౌలింగ్ చేయలేడు?' ఆ ప్రశ్నను మీరు క్రికెట్ ఆస్ట్రేలియానే అడగాలి" అని అజింక్య రహానే ప్రజంటేషన్ సమయంలో చెప్పాడు. ఈ మ్యాచ్‌లో కామెరూన్ గ్రీన్ పెద్ద ప్రభావం చూపలేకపోయాడు. 10 బంతులు ఆడిన గ్రీన్ ఒక ఫోర్, ఒక సిక్సర్‌తో కేవలం 18 పరుగులు మాత్రమే చేశాడు. అజింక్య రహానే 67, అంగ్‌క్రిష్ రఘువంశీ 51 పరుగులు చేయడంతో కేకేఆర్ 220/4 పరుగులు చేసింది. భారీ టార్గెట్ ఛేజింగ్‌లో ముంబై వీరోచితంగా ఆడింది. ర్యాన్ రికెల్టన్ 81, రోహిత్ శర్మ 78 పరుగులు చేయడంతో 19.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది.