పవన్ కళ్యాణ్ సార్.. మా బిడ్డ ఆత్మకు శాంతిని చేకూర్చండి.. జవాన్ మురళీ నాయక్ తల్లిదండ్రుల విజ్ఞప్తి

Wait 5 sec.

. ఆపరేషన్ సింధూర్ సమయంలో యుద్ధ క్షేత్రంలో దేశం కోసం పోరాడుతూ పాతికేళ్లకే అమరుడైన తెలుగు సైనికుడు. మరికొన్ని రోజులలో మురళీ నాయక్ వీరమరణం పొంది.. ఏడాది పూర్తి కావొస్తోంది. ఈ నేపథ్యంలో అతని తల్లిదండ్రులు మురళీ నాయక్ వైకుంఠ సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు . మురళీ నాయక్ స్వస్థలం శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలోని కల్లితండాలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో మురళీ నాయక్ వైకుంఠ సమారాధనకు రావాలంటూ అతని తల్లిదండ్రులు శ్రీరాంనాయక్, తల్లి జ్యోతిబాయి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌న ఆహ్వానించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో వీడియో షేర్ చేశారు. "ఉండేది ఒక్కడివి.. ఇలాంటి ఉద్యోగం మనకొద్దని చెప్పినా మురళీ నాయక్ వినలేదు. దేశానికి సేవ చేయాలనేదే తన కోరిక అని చెప్పాడు. మిలటరీ డ్రెస్సు ఒక్కరోజైనా వేసుకోవాలని తపనపడ్డాడు. నాకు అనుకోకుండా ఏమైనా జరిగినా.. దేశ ప్రజలు మనతో ఉంటారని చెప్పాడు. ఏప్రిల్ 14వ తేదీన కల్లితండాలో మురళీ నాయక్ వైకుంఠ సమారాధన జరుపుతున్నాం. సార్.. మీరంటే మురళీకి చాలా అభిమానం. ఇష్టం.. మీరు వస్తే మురళీ ఆత్మ శాంతిస్తుంది. తప్పకుండా రండి సర్.. మీ దగ్గరకు ఎలా రావాలో తెలియడం లేదు. అందుకే వీడియో షేర్ చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ సార్.. దేశం కోసం ప్రాణాలు అర్పించిన మురళీ నాయక్‌కు మీరు వచ్చి నివాళులు అర్పించాలని కోరుకుంటున్నాం.."అంటూ తల్లిదండ్రులు శ్రీరాంనాయక్, జ్యోతిబాయి వీడియోలో కోరారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మారుమూల తండాలో.. ఓ నిరుపేద కుటుంబంలో జన్మించిన మురళీ నాయక్‌కు సైన్యంలో చేరాలనే కోరిక. ఈ క్రమంలోనే 2022 డిసెంబరు 29న అగ్నివీర్ జవానుగా సైన్యంలో చేరారు. 851 లైట్‌ రెజిమెంట్‌లో విధులు నిర్వహించేవారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఆర్మీ అధికారులు మురళీ నాయక్‌ను నాసిక్‌ నుంచి జమ్మూకశ్మీర్‌కు పిలిపించారు. సరిహద్దుల వద్ద చొరబాటుదారులతో జరిగిన ఎదురుకాల్పుల్లో 2025 మే నెల మొదటి వారంలో మురళీ నాయక్‌ వీరమరణం పొందారు. చిన్నప్పటి నుంచి దేశభక్తి ఎక్కువగా ఉన్న మురళీ నాయక్.. రైల్వేలో వచ్చిన ఉద్యోగం కూడా వదులుకుని సైన్యంలో చేరారు. అయితే అనుకోని పరిస్థితులలో దేశం కోసం పోరాడుతూ వీరమరణం పొందారు. మురళీ నాయక్‌కు.. అప్పట్లో కల్లితండాను సందర్శించారు. ఆర్మీ జవాన్ మురళీ నాయక్‌ కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున రూ. 50 లక్షల సాయం, ఐదెకరాల భూమి ప్రకటించటంతో పాటుగా.. మురళీ నాయక్ స్మారక చిహ్నం ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చారు. అలాగే వ్యక్తిగతంగా మురళీ నాయక్ కుటుంబానికి రూ. 25 లక్షల సాయం ఇస్తానని ప్రకటించిన పవన్ కళ్యాణ్.. ఆ మొత్తాన్ని అందించి మాట నిలబెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో మురళీ నాయక్ వైకుంఠ సమారాధనకు రావాలని మురళీ నాయక్ తల్లిదండ్రులు పవన్ కళ్యాణ్‌ను ఆహ్వానించారు.