ప్రతీ ఒక్కరికీ చదువు అవసరం. ఉద్యోగాలు చేయకపోయినా.. చదవడం, రాయడం వంటి కనీస ప్రక్రియలైనా రావాలని చెబుతూ ఉంటారు. నిరక్షరాస్యులుగా ఉన్న వారిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం.. కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపడుతోంది. ఇందులో భాగంగానే చదువుకోని, నిరక్షరాస్యులైన మహిళలను మహిళా సంఘాల ద్వారా గుర్తిస్తున్నారు. అలాంటి వారికి 100 రోజుల పాటు ట్రైనింగ్ ఇచ్చి.. ఆ తర్వాత పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ అమ్మకు అక్షరమాల కార్యక్రమంలో పాల్గొనేందుకు.. రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో అనేక మంది మహిళలు ఆసక్తి చూపించారు. ఈ నేపథ్యంలోనే మహిళలకు 100 రోజుల పాటు.. ఆయా స్కూళ్లలో వాలంటీర్లు బోధన చేశారు. ఇలా వంద రోజుల పాటు శిక్షణ తీసుకున్న తర్వాత ఆ మహిళలకు ఉల్లాస్ (అండర్ స్టాండింగ్ ఆఫ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ) పరీక్షలు చేపట్టారు. అందులో భాగంగానే నిర్మల్ జిల్లాలో ఏకంగా 18 వేల మంది మహిళలు ఆదివారం రోజున విజయవంతంగా పరీక్షలు రాశారు. ఇక ఈ ఎగ్జామ్ సెంటర్లను నిర్మల్ డీఈఓ భోజన్నతో పాటు విద్యాశాఖ అధికారులు కూడా సందర్శించి పలు కీలక సూచనలు చేశారు. ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని 20 గ్రామ పంచాయతీల పరిధిలో నిర్వహించిన ఈ పరీక్షకు 836 మంది మహిళలు హాజరైనట్లు ఏపీఎం వినేష్ వెల్లడించారు. మరోవైపు.. జగిత్యాల జిల్లాలో అమ్మకు అక్షరమాల కార్యక్రమంలో భాగంగా మెప్మా ఆధ్వర్యంలో జిల్లాలోని మహిళా సంఘాల ద్వారా గుర్తించిన నిరక్షరాస్యులైన మహిళలకు వాలంటీర్లు చదవడం, రాయడం నేర్పించారు. ఇక ఇలా ట్రైనింగ్ తీసుకున్న మహిళలకు వయోజన విద్య శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఉల్లాస్ పరీక్షలను నిర్వహించారు. ఈ పరీక్షల్లో జిల్లావ్యాప్తంగా ఉన్న 5 మున్సిపాలిటీల నుంచి సుమారు 900 మంది మహిళలు హాజరయ్యారు. తాము చదువుకుని.. ఈ స్థాయికి చేరేందుకు ఎంతో కృషి చేసిన జిల్లా కలెక్టర్‌కు మహిళలు ధన్యవాదాలు చెప్పారు.ఇక ఈ 100 రోజుల బోధనలో భాగంగా మహిళలకు పలు అంశాలను నేర్పిస్తారు. మన ఆచార వ్యవహారాలు, మా ఇంటి మహాలక్ష్మి, పిల్లల పెంపకం-మన బాధ్యత, కుటుంబం-ఇరుగుపొరుగు, పరిశుభ్రత-ఆరోగ్యం, ఎన్నికలు, చట్టాలు తెలుసుకుందాం, డిజిటల్‌ అక్షరాస్యత వంటి అంశాలకు అనుగుణంగా తెలుగు భాష, రోజువారీ పనుల్లో ఉపయోగపడే లెక్కలకు సంబంధించిన నైపుణ్యాలను పెంపొందించే ఉద్దేశంతో పుస్తకాలను తయారు చేశారు.