రూ.300 టికెట్లు లేకున్నా ఏప్రిల్‌లో శ్రీవారిని దర్శనం.. లాస్ట్ ఛాన్స్!

Wait 5 sec.

తిరుమల శ్రీవారిని నిత్యం వేలాదిమంది భక్తులు దర్శించుకుంటారు. భక్తులు దివ్య దర్శనం, సర్వ దర్శనం, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, ఆర్జిత సేవలు, శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల ద్వారా దర్శించుకునే అవకాశం ఉంటుంది. అలాగే టీటీడీ భక్తుల కోసం ప్రతి నెలా ఆన్‌లైన్‌ ద్వారా ఆర్జిత సేవలు, శ్రీవాణి ట్రస్ట్, అంగ ప్రదక్షిణ, రూ.300 దర్శన టికెట్లు, వసతి గదుల్ని విడుదల చేస్తోంది. టీటీడీ ఇలా ఆన్‌లైన్‌‌లో విడుదల చేసేవాటిలో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోసం ఎక్కువమంది భక్తులు ప్రయత్నిస్తారు. కానీ టికెట్లు విడుదల చేసిన గంటలోపే కోటా పూర్తవుతోంది.. దీంతో కొందరు భక్తులకు టికెట్లు దొరకడం లేదు. అయితే రూ.300 దర్శన టికెట్లు దొరకని వారికి మరో అవకాశం కూడా ఉంది.. అదే టీటీడీ నిర్వహిస్తున్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం.టీటీడీ అలిపిరిలోని సప్తగోప్రదక్షిణశాలలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిర్వహిస్తోంది. ఈ టికెట్ పొందిన భక్తులు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని పొందొచ్చు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.. భక్తులు శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్‌ను రూ.1600తో కొనుగోలు చేస్తే.. ఇద్దరు ఈ హోమంలో పాల్గొనే అవకాశం ఇస్తోంది టీటీడీ. ఈ హోమం పూర్తయిన తర్వాత.. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు..రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి అనుమతిస్తారు. ఇలా ప్రతి నెలా టీటీడీ శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లను ఆన్‌లైన్‌లో జారీ చేస్తోంది. టీటీడీ ఏప్రిల్ నెలకు సంబంధించిన శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం టికెట్లను ఆన్‌లైన్‌లో మార్చి 25న (బుధవారం) ఉదయం 10 గంటలకు విడుదల చేయనుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ సూచిస్తోంది. ఒంటమిట్ట బ్రహ్మోత్సవాలకు భారీ ఏర్పాట్లుమరోవైపు ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు, ఏప్రిల్ 1న నిర్వహించనున్న శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి టీటీడీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. టీటీడీ జేఈవో వీరబ్రహ్మం ఒంటిమిట్టలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఆలయ నాలుగు మాడ వీధులు, క్యూలైన్లు, యాగశాల, పోటు, సాంస్కృతిక వేదికలను పరిశీలించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. వేసవి ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకుని ఆలయ ప్రాంగణంలో జర్మన్ షెడ్లు ఏర్పాటు చేయడం, తాగునీటి సదుపాయాలను విస్తరించడం, భక్తులకు చల్లని వాతావరణం కల్పించే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.అన్నప్రసాద భవనాన్ని పరిశీలించి భక్తులకు అందిస్తున్న అన్నప్రసాదాల నాణ్యతపై జేఈవో సంతృప్తి వ్యక్తం చేశారు. భక్తులతో నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. కళ్యాణ వేదిక వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులు, ప్రసాద పంపిణీ కేంద్రాలు, క్యూలైన్లు, గ్యాలరీలు, ప్రవేశ–నిష్క్రమణ మార్గాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. పారిశుద్ధ్యానికి ప్రాధాన్యం ఇస్తూ అవసరమైనన్ని మరుగుదొడ్లు ఏర్పాటు చేయడం, అదనపు సిబ్బందిని నియమించాలని ఆదేశించారు. ఆలయం, క్యూలైన్లు, అన్నప్రసాద వితరణ కేంద్రాలు, గ్యాలరీలలో భక్తులకు సేవలు అందించేందుకు తగినంత మంది శ్రీవారి సేవకులను ఏర్పాటు చేయాలని సూచించారు.