హైదరాబాద్ మహానగరంలో ఇక నుంచి ప్రయాణం సాఫీగా సాగనుంది. నగర ప్రజల ప్రయాణాన్ని సుఖమయం చేసేందుకు మూడు నగరపాలక సంస్థలు నడుం బిగించాయి. జీహెచ్‌ఎంసీ (GHMC), సైబరాబాద్ నగరపాలక సంస్థ (CMC), మల్కాజిగిరి నగరపాలక సంస్థ (MMC) సంయుక్తంగా రహదారి అభివృద్ధి పనులను వేగవంతం చేశాయి. ఇప్పటికే సీఎంసీ, ఎంఎంసీ కార్పొరేషన్లు జోన్ల వారీగా టెండర్ల ప్రక్రియను ప్రారంభించగా.. తాజాగా జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ నగరంలోని ఆరు జోన్లకు కలిపి రూ.150 కోట్ల ప్రత్యేక నిధులను కేటాయించారు. ప్రతి జోన్‌కు రూ.25 కోట్ల చొప్పున కేటాయించిన ఈ బడ్జెట్‌తో అత్యవసర రోడ్ల మరమ్మతులు చేపట్టనున్నారు. మార్చి 31వ తేదీలోపు .. ఉన్నతాధికారుల ఆమోదం పొందాలని జోనల్ కమిషనర్లకు కమిషనర్ కర్ణన్ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం పాత జీహెచ్‌ఎంసీ పరిధిలోని డివిజన్లలో కార్పొరేటర్లకు కేటాయించిన కోటి రూపాయల నిధులలో మెజారిటీ వాటా సీసీ రోడ్ల నిర్మాణానికే ఖర్చవుతోంది. దీనివల్ల ప్రధాన అంతర్గత రహదారుల నిర్వహణ కుంటుపడుతోందన్న ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే కమిషనర్ కేటాయించిన రూ.150 కోట్ల నిధులు అత్యంత కీలకంగా మారాయి. ఇప్పటికే చార్మినార్, సికింద్రాబాద్ జోన్ల అధికారులు స్పందించి పనులకు ఆమోదం పొందుతున్నారు. మరోవైపు సీఎంసీకి రూ.500 కోట్లు, ఎంఎంసీకి రూ.500 కోట్ల బడ్జెట్ కేటాయించగా.. అందులో సీఎంసీ రూ.300 కోట్లు, ఎంఎంసీ రూ.250 కోట్ల విలువైన పనులకు గ్రీన్ సిగ్నల్ పొందాయి.నగర విస్తరణతో రహదారుల సవాళ్లు కూడా పెరిగాయి. గతంలో 9 వేల కిలోమీటర్లుగా ఉన్న రోడ్ల పొడవు, శివారులోని 27 స్థానిక సంస్థల విలీనంతో ఏకంగా 14,787.66 కిలోమీటర్లకు చేరింది. ఈ శివారు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఉన్న మట్టి రోడ్లను బీటీ రోడ్లుగా మార్చడం ఇప్పుడు ఇంజినీరింగ్ విభాగం ముందున్న ప్రధాన లక్ష్యం. దీనికి తోడు 'కాంప్రహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రాం' (CRMP) కింద 1045.01 కిలోమీటర్ల ప్రధాన రహదారులను రూ.3,145 కోట్ల భారీ వ్యయంతో శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ భారీ అభివృద్ధి పనులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే.. నగరవాసులు ట్రాఫిక్ కష్టాల నుంచి గట్టెక్కడమే కాకుండా, ప్రమాద రహితంగా సాఫీగా ప్రయాణించే వీలుంటుంది. దాంతో పాటు ఆయా కాలనీలు రహదారుల పరంగా అభివృద్ధి చెందనున్నాయి. త్వరలోనే ఈ రోడ్ల నిర్మాణ పనులు పట్టాలెక్కనుండగా.. ఈ ఏడాది చివరికల్లా పూర్తి చేయాలని అధికారులు టార్గెట్‌గా పెట్టుకున్నారు.