నాన్‌వెజ్ ప్రియులకు గుడ్‌న్యూస్.. తగ్గిన చికెన్ ధరలు, ఇక కుమ్మేయండి..!

Wait 5 sec.

నాన్‌వెజ్ ప్రియులకు ఇది గుడ్‌న్యూసే. ఎందుకంటే మార్చి నెల ప్రారంభం నుండి ఎట్టకేలకు కొండదిగాయి. గతవారం కిలో చికెన్ ధర ఏకంగా రూ.360 నుండి రూ.380 వరకు పలకడంతో సామాన్యులు చికెన్ వైపు చూడాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. వేసవి ఉష్ణోగ్రతలు అకస్మాత్తుగా పెరగడంతో కోళ్ల మరణాలు, దాణా ఖర్చులు పెరగడం వల్ల ఫామ్ యజమానులు దీనికి తోడు పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల సీజన్ కావడంతో డిమాండ్ విపరీతంగా పెరిగి చికెన్ ధరలు ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ధరల భారం భరించలేక చాలామంది మాంసాహారులు చేపలు, రొయ్యలు వంటి సీ-ఫుడ్ వైపు మొగ్గు చూపారు. హైదరాబాద్‌లో అయితే కొందరు వ్యాపారులు ధరలు ఎక్కువ కావటం, గిరాకీ లేకపోవటంతో దుకాణాలు మూసివేసేందుకు సిద్ధమయ్యారు. అయితే, వారం రోజుల వ్యవధిలోనే మార్కెట్ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం మార్కెట్లోకి కోళ్ల సరఫరా మెరుగుపడటంతో పాటు, పెళ్లిళ్ల రద్దీ కాస్త తగ్గడంతో ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్, వరంగల్ నగరాల్లో ప్రస్తుతం స్కిన్ లెస్ చికెన్ కిలో రూ.270- 290 మధ్య పలుకుతోంది. గతవారంతో పోలిస్తే దాదాపు రూ.100 మేర తగ్గింపు లభించడంతో చికెన్ సెంటర్ల వద్ద మళ్లీ సందడి కనిపిస్తోంది. వాతావరణంలో వచ్చే మార్పులు, కోళ్ల పెంపకంలో ఎదురయ్యే సవాళ్లు, మార్కెట్ డిమాండ్‌ను బట్టి ఈ ధరలు ప్రతిరోజూ మారుతుంటాయని వ్యాపారస్తులు చెబుతున్నారు. ప్రస్తుతానికి ధరలు అదుపులోకి రావడంతో మధ్యతరగతి ప్రజలకు పెద్ద ఉపశమనం లభించినట్లయింది. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగితే కోళ్ల సరఫరాపై ప్రభావం పడి, ధరలు మళ్లీ పెరిగే అవకాశం లేకపోలేదని పౌల్ట్రీ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక మటన్, చేపల ధరల్లో మాత్రం మార్పు లేదు. ప్రాంతాన్ని బట్టి కిలో మటన్ రూ.850 నుంచి రూ.1000 మధ్య పలుకుతోంది. ఇక చేపలు బొచ్చె, రవ్వ వంటివి కిలో. రూ.200, కొర్రమేను రూ.300 వరకు పలుకుతున్నాయి. ఇదే సమయంలో గుడ్ల ధరలు భారీగా తగ్గాయి. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిస్థితులు, ఎగుమతి ఆంక్షల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో గుడ్ల ధరలు అనూహ్యంగా తగ్గాయి. ముఖ్యంగా ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం వల్ల సరఫరా గొలుసు దెబ్బతినడం, గల్ఫ్ దేశాలకు ఎగుమతులు తగ్గడంతో దేశీయ మార్కెట్లోకి గుడ్ల నిల్వలు భారీగా వచ్చి చేరాయి. ఎగుమతి కావాల్సిన నిల్వలు స్థానిక మార్కెట్లోకి రావడంతో సరఫరా పెరిగి ధరలు అమాంతం పడిపోయాయి. ఇది పౌల్ట్రీ రైతులకు నష్టం చేకూరుస్తున్నప్పటికీ వినియోగదారులకు మాత్రం పెద్ద ఉపశమనం కలిగిస్తోంది. ప్రస్తుతం 30 గుడ్ల కేసు రూ.130 వరకు పలుకుతుండగా.. 100 గడ్లు రూ.430 వరకు విక్రయిస్తున్నారు.