చెత్త బౌలింగ్‌తోనే సన్‌రైజర్స్ ఓటమి.. ఓపెన్‌గా ఒప్పుకొన్న కోచ్ వెటోరీ

Wait 5 sec.

చిన్నస్వామి స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది. 201/9 పరుగులు చేసినా.. ఆ టార్గెట్‌ను కాపాడుకోవడంలో విఫలమై, కేవలం 15.4 ఓవర్లలోనే చేతులెత్తేసింది. అందరూ అనుకున్నట్టే సన్‌రైజర్స్ చెత్త బౌలింగ్‌తోనే ఓడిపోయిందని హెడ్ కోచ్ కూడా ఒప్పుకొన్నాడు. ఐపీఎల్ 2026 ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ తడాఖా ఏంటో చూయించింది. భారీ స్కోర్ ఇచ్చినప్పటికీ.. ఛేజింగ్‌లో అలవోకగా పరుగులు చేసి కేవలం 15.4 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి ఘన విజయం సాధించింది. విరాట్ కోహ్లి, దేవదత్ పడిక్కల్ బ్యాటింగ్ ముందు సన్‌రైజర్స్ బౌలర్లు నిలబడలేకపోయారు. "బౌలింగ్‌లో మంచి ఆరంభం అవసరం. అందుకు తగ్గట్టుగానే ఫిల్ సాల్ట్ వికెట్ తీసి మంచి స్టార్ట్ ఇచ్చాం. కానీ ఆ తర్వాత మేము సరిగా బౌలింగ్ చేయలేకపోయాం. కోహ్లి, పడిక్కల్ బౌండరీలు చేయడానికి అవకాశాలు ఇచ్చాం. ఇది మా చెత్త బౌలింగ్ ప్రదర్శనలలో ఒకటి" అని డేనియల్ వెటోరీ అంగీకరించాడు. " ఎలా బౌలింగ్ చేసిందో మేం గమనించాం. కానీ మా ప్లాన్స్ అమలు చేయడంలో దారుణంగా విఫలమయ్యాం. యువ బౌలర్లు డేవిడ్ పైన్, హర్ష్ దూబే రాబోయే మ్యాచ్‌లలో మెరుగ్గా రాణిస్తారని అనుకుంటున్నారు. కొన్నేళ్ల కిందట 200 స్కోర్ చేస్తే సేఫ్ అనుకునే వాళ్లు. కానీ ఇప్పుడు గేమ్ మారిపోయింది" అని వెటోరీ అభిప్రాయపడ్డాడు. సన్‌రైజర్స్ బ్యాటింగ్ గురించి కూడా మాట్లాడిన వెటోరీ.. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ త్వరగా అవుటవ్వడంతో మిడిలార్డర్‌పై ఒత్తిడి పడిందన్నాడు. వికెట్లు పడినా ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్ మంచి ఇన్నింగ్స్ ఆడారని.. అదేవిధంగా అనికేత్ వర్మ కీలక సమయంలో దూకుడుగా ఆడటం జట్టు 200 మార్క్ టచ్ అయ్యేలా చేసిందన్నాడు. కీలక ఆల్‌రౌండర్ బ్రైడన్ కార్స్ కోల్‌కతాతో జరిగే మ్యాచ్ సమయానికి అందుబాటులోకి వస్తాడని తెలిపాడు. తొలి మ్యాచ్‌లో జరిగిన తప్పుల్ని సవరించుకుని రానున్న మ్యాచ్‌లలో ఆడతామని డేనియల్ వెటోరీ చెప్పాడు.