రెండు నెలల బిడ్డతో ఆరుబయట పడుకున్న తల్లి.. అర్థరాత్రి హఠాత్తుగా వచ్చి చిన్నారిని లాక్కెళ్లిన చిరుత

Wait 5 sec.

: మహారాష్ట్రలో గుండెలు పిండేసే విషాద ఘటన చోటుచేసుకుంది. అమ్మ ఒడిలో ప్రశాంతంగా నిద్రిస్తున్న రెండు నెలల పసికందును ఒక క్రూర మృగం ఎత్తుకెళ్లిపోయింది. ముఖ్యంగా వేసవి కాలం కావడంతో.. ఇంట్లో ఉక్కపోస్తుందని తన రెండు నెలల చిన్నారితో సహా ఓ తల్లి ఆరుబయట పడుకుంది. ఈక్రమంలోనే అక్కడకు వచ్చిన ఓ పులి.. తల్లి పక్కలో ఉన్న చిన్నారిని నోట కరుచుకుని అటవీ ప్రాంతంలోకి లాక్కెళ్లిపోయింది. ఈ దారుణ ఘటన ఎప్పుడు, ఎలా చోటు చేసుకుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం పదండి. నిద్రలోనే మృత్యువు కౌగిలిలోకి..స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని జల్‌గావ్ జిల్లాలోని మమల్డే గ్రామ ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ముఖ్యంగా గ్రామంలోని ఓ కుటుంబం.. వేసవి కాలం కావడం, అందులోనూ విపరీతమైన వేడి గాలులు రావడంతో ఇంట్లో ఉండలేక రాత్రిపూట ఆరు బయట పడుకుంది. వీరితో పాటే రెండు నెలల క్రితమే ఓ పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చిన ఓ తల్లి సైతం తన శిశువుతో బయటే పడుకుంది. అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో.. సమీప అటవీ ప్రాంతం నుంచి వచ్చిన ఒక చిరుత పులి వచ్చింది. ఆరుబయట పడుకున్న వీరిని చూసిన చిరుత.. ఏమాత్రం చప్పుడు కాకుండా అక్కడకు వెళ్లింది. తల్లి పక్కలో ఉన్న చిన్నారిని మెరుపు వేగంతో నోట కరుచుకుని పొలాల్లోకి పారిపోయింది. బిడ్డను ఎత్తుకెళ్లినా గుర్తించని తల్లి..!అయితే పులి వచ్చిన విషయం కానీ బిడ్డను ఎత్తుకెళ్లిన విషయం కానీ కుటుంబానికి తెలియలేదు. వారంతా నిద్రలోనే ఉండగా వాళ్లు గమనించలేకపోయారు. కానీ ఉదయం లేచేసరికి.. పక్కలో ఉండాల్సిన బిడ్డ లేకపోవడంతో తల్లి షాక్‌కు గురైంది. వెంటనే కుటుబం సభ్యులు ఎవరైనా తన బిడ్డను తీసుకున్నారేమోనని చూసింది. వారందరినీ పిలిచి అడిగింది. కానీ తామెవరూ చూడలేదని చెప్పగా.. బిడ్డను వెతకడం ప్రారంభించారు. స్థానికులు సైతం చిన్నారి కోసం దేవులాడారు. ఈక్రమంలోనే.. ఇంటికి కొంత దూరంలో ఉన్న పొలాల్లో గుండెలు పగిలే దృశ్యం కనిపించింది. ఆ చిన్నారి మృతదేహం మాంసపు ముద్దలుగా మారి చెల్లాచెదురుగా పడి ఉండడం చూసి తల్లి సహా కుటుంబ సభ్యులంతా గుండెలవిసేలా రోదించారు. స్థానికులు సైతం కంటనీరు పెట్టారు.బిడ్డ మృతదేహానికి దగ్గర్లో పులి అడుగులు కనిపించడం.. మాంసపు ముద్దలా మారేలా చేసిన దాడి పులి మాత్రమే చేస్తుందని భావించిన స్థానికులు వెంటనే పోలీసులు, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో వాళ్లు హుటాహుటిన రంగంలోకి దిగి.. ప్రాథమిక విచారణ జరిపారు. ఈక్రమంలోనే ఆ చిన్నారిని లాక్కెళ్లింది చిరుత పులే అని ధ్రువీకరించారు. ఈ ఘటనతో మమల్డే గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్నాళ్లుగా ఈ ప్రాంతంలో వన్యప్రాణుల సంచారం విపరీతంగా పెరిగిందని.. అనేక సార్లు పశువులపై దాడులు జరిగినట్లు చెప్పి ఆవేదన వ్యక్తం చేశారురు. అధికారులకు ఫిర్యాదు చేసినా సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే నేడు ఒక పసి ప్రాణం బలయిందని ఆరోపిస్తున్నారు.అయితే చిన్నారిని పొట్టనపెట్టుకున్న ఆ చిరుత పులిని వెంటనే పట్టుకోవాలని.. అటవీ ప్రాంతం చుట్టూ రక్షణ చర్యలు చేపట్టాలని గ్రామస్థులు రోడ్డుపై బైఠాయించారు. అటవీ శాఖ అధికారులు ఆ ప్రాంతంలో బోన్లు ఏర్పాటు చేసి, నిరంతరం గస్తీ నిర్వహించాలని స్థానిక నేతలు కోరుతున్నారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పసిబిడ్డను కోల్పోయిన ఆ తల్లి రోదనలు గ్రామంలో అందరినీ కన్నీరు పెట్టిస్తున్నాయి.