స్టాక్ మార్కెట్లలో కొవిడ్ క్రాష్‌ను మించి రికార్డు పతనం.. మార్చి వరస్ట్.. ఒక్క నెలలో లక్ష కోట్లకుపైగా వెనక్కి!

Wait 5 sec.

: భారత స్టాక్ మార్కెట్లలో తీవ్ర అమ్మకాల ఒత్తిడి నెలకొంటోంది. . ఈ క్రమంలోనే ముఖ్యంగా విదేశీ సంస్ధాగత పెట్టుబడిదారులు (FII) తమ పెట్టుబడుల్ని పెద్ద మొత్తంలో ఉపసంహరించుకుంటుండటం కూడా స్టాక్ మార్కెట్ల పతనానికి దారితీస్తోంది. స్టాక్ మార్కెట్లు మార్చి నెలలో భారీ స్థాయిలో పతనం అయ్యాయని చెప్పొచ్చు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ లక్షల కోట్లు ఆవిరైపోతోంది. గత 2 రోజుల్లో కూడా స్టాక్ మార్కెట్లలో సూచీలు భారీ పతనంతో.. రికార్డు స్థాయిలో రూ. 18.6 లక్షల కోట్లు ఆవిరైంది. ఇక ఇక్కడ ఎఫ్ఐఐల అమ్మకాలు 2 రోజుల్లోనే రూ. 11,163 కోట్లుగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. >> స్టాక్ మార్కెట్ హెచ్చుతగ్గుల్లో విదేశీ సంస్థాగత పెట్టుబడులు కూడా కీలక పాత్ర పోషిస్తుంటాయి. విదేశీ సంస్థాగత మదుపరుల (ఫారెన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు- FII) నుంచి కొనుగోళ్లు ఎక్కువగా ఉంటే సాధారణంగా స్టాక్ మార్కెట్లు లాభాల్లో పయనిస్తుంటాయి. కానీ .. భారత స్టాక్ మార్కెట్ల నుంచి సుమారు 12 బిలియన్ డాలర్లకుపైగా తమ పెట్టుబడుల్ని వెనక్కి తీసుకున్నారు. ఇది భారత కరెన్సీలో చూస్తే సుమారు రూ. 1.20 లక్షల కోట్లకుపైనే ఉంటుంది. ఇంకా ఇందులో మార్చి 30 (సోమవారం) డేటా కలపలేదు. ఇది కలిపితే ఇంకా ఎక్కువే ఉంటుందని చెప్పొచ్చు. భారత స్టాక్ మార్కెట్ చరిత్రలోనే ఒక నెలలో విదేశీ పెట్టుబడులు ఈ స్థాయిలో వెనక్కి పోలేదని నిపుణులు చెబుతున్నారు. గతంలో 2024 అక్టోబర్ నెలలో అత్యధికంగా రూ. 94 వేల కోట్ల వరకు విదేశీ పెట్టుబడులు తరలిపోయాయి. 2025 జనవరిలో రూ. 78 వేల కోట్లు తరలిపోగా.. 2022 జూన్‌లో రూ. 50 వేల కోట్లు వెనక్కి వెళ్లడం అత్యధికంగా ఉన్నాయి. ఇంకా 2020 లో కొవిడ్ విధ్వంసం సమయంలో అప్పుడు మార్చిలోనూ విదేశీ పెట్టుబడులు రూ. 61,897 కోట్ల మేరే వెనక్కి వెళ్లింది. ఇప్పుడు ఆ రికార్డులన్నింటినీ కూడా దాటేయడం గమనార్హం. మార్చి నెలలోనే నిఫ్టీ 11 శాతం తగ్గింది. నిఫ్టీ బ్యాంకింగ్ ఇండెక్స్ 16 శాతం తగ్గగా.. పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 19 శాతం పతనమైంది. ఇక్కడ పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో క్రూడాయిల్ ధరలు పెరగడం.. ద్రవ్యోల్బణం పెరగడం.. రూపాయి పతనం కావడం.. గల్ఫ్ దేశాల నుంచి భారత్‌కు వచ్చే నిధులు తగ్గడం.. ఇలా ఇవన్నీ స్టాక్ మార్కెట్ల పతనానికి దారితీస్తోంది. గమనిక: పైన చెప్పింది సమాచారం కోసం మాత్రమే.. పెట్టుబడులకు సిఫార్సు కాదు. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్‌కు లోబడి ఉంటాయి. వీటిల్లో ఇన్వెస్ట్ చేసే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.