అసలు శ్రీవల్లి ఎంఏ చదవలేదని.. చదివింది తొమ్మిదో తరగతి అయినా.. ఫేక్ సర్టిఫికేట్‌లను సృష్టించి.. వాటి ద్వారా స్కూల్‌లో టీచర్‌గా జాయిన్ అయ్యిందని నర్మద ద్వారా తెలుసుకున్న చందు.. శ్రీవల్లిని మెడపట్టి బయటకు గెంటేశాడు నేటి (మార్చి 31) ఎపిసోడ్‌లో. లాగిపెట్టి చెంపపై కొట్టడమే కాకుండా.. మీ మొహం నాకు చూపించకు అని అసహ్యించుకుంటున్నాడు చందు. ఇక కుడితిలో పడ్డ ఎలుకని సూదులుపెట్టి గుచ్చినట్టుగా శ్రీవల్లికి పట్టపగలే రక్త కన్నీరు చూపిస్తున్నారు నర్మద, ప్రేమలు. ఇది ప్రీ క్లైమాక్స్ మాత్రమే.. అసలు సినిమా ముందు ఉంది. నీ ఫేక్ సర్టిఫికేట్స్ విషయం ఒక్కటే బయటపడింది.. పెళ్లి విషయంలో మీరు దాచిపెట్టిన నిజాలన్నీ బయటకు లాగుతాం అంటూ శ్రీవల్లికి నిద్రలేకుండా చేస్తున్నారు నర్మద, ప్రేమ. వీళ్ల వ్యవహారం ఇలా ఉంటే.. రామరాజు గునపంతో కొబ్బరి కాయలు ఒలుస్తూ ఉంటే.. శ్రీరామా శ్రీరామా అంటూ వస్తుంది వేదవతి ఏదో కొంపలు అంటుకునిపోతున్నట్టుగా. మీరు కొబ్బరి కాయలు ఒలుస్తున్నారేంటండీ.. డాక్టర్ గారు మిమ్మల్ని రెస్ట్ తీసుకోమన్నారు కదా.. ముందు ఈ మజ్జిగ తాగండి అని అంటుంది. ఇంట్లో ముగ్గురు కొడుకులతో పాటు తిరుపతి కూడా ఉన్నాడు.. ఈ పనులన్నీ మీకెందుకండీ అని అంటుంది వేదవతి. ‘నేను ఇంట్లో ఖాళీగా తిని కూర్చోలేను బుజ్జమ్మా.. మిల్లుకి ఎలాగూ వెళ్లడం లేదు.. కాళ్లూ చేతులు కట్టేసినట్టు ఉంది అని అంటాడు రామరాజు. దాంతో వేదవతి.. ‘నేను కూడా మీలో సగం కదా.. నేను కూడా ఒలుస్తా’ అని అంటుంది వేదవతి. కొడుకులు, కోడళ్లు ఊ అంటే చాలు సాంగ్‌లు వేసుకుంటారు.. మనకేం తక్కువా అని అనుకుందో ఏమో కానీ.. ‘పేరెట్టి నిన్నెట్ట పిలిచేదీ.. నా ఇంటి పెనిమిటివే’ అంటూ సాంగ్ వేసుకుంటుంది వేదవతి.రామరాజుతో కలిసి కొబ్బరికాయలు ఒలుస్తూ.. ‘నా బంగారి మామా.. నా బలశాలి మామ అంత ఇష్టం ఏంటయ్యా నీకు.. నా మీద’ అంటూ మెలికలు తిరుగుతుంది వేదవతి. మొత్తానికి ఇద్దరూ కొబ్బరి కాయలు ఒలిచే కార్యక్రమాన్ని షురూ చేస్తారు. ఇంతలో ధీరజ్ రావడంతో.. ఆ రొమాన్స్‌లో నుంచి బయటకు వస్తారు. మీరు ఈ పని చేస్తున్నారేంటి నాన్నా.. నేను చేస్తాను ఇలా ఇవ్వండి.. ఇప్పటి వరకూ మీరు ఈ ఇంటికోసం మా కోసం పడిన కష్టాలు చాలు నాన్నా.. అని సెంటిమెంట్ డైలాగ్‌లు కొడతాడు ధీరజ్. ఇక ప్రేమ.. కాఫీ తీసుకొచ్చి ధీరజ్ ఇస్తుంది. స్ట్రాంగ్‌గా.. ప్రేమగా తెచ్చా కాఫీ తీసుకో అని అంటుంది ప్రేమ. అయితే ధీరజ్ మాత్రం అలక వదలడు. నీ చేత్తో ఇస్తే నేను తాగను అని అంటాడు ధీరజ్. ‘రేయ్.. ఆ కాఫీ నేనే పెట్టానురా.. తాగు’ అని అంటుంది వేదవతి. మా అమ్మ చేసింది కాబట్టి తాగుతానంటూ కాఫీ టేస్ట్ చేసిన ధీరజ్.. ‘ఆహా అమృతం అంటూ లొట్టలేసుకుని మరీ తాగుతాడు. ఈ ప్రేమ చేతితో పెడితే అలా ఉంటుంది అంటూ జలక్ ఇస్తుంది ప్రేమ. ఇక వీళ్లద్దరూ ఉంటే సాంగ్ మస్ట్ కాబట్టి అదే పనిలో పడ్డారు. ధీరజ్ కంట్లో నలుసు పడటంతో వేదవతి డైరెక్షన్‌లో కంట్లో నలక తీస్తూ.. ‘ఏమైందో ఈవేళ’ అంటూ సాంగ్ వేసుకుంటున్నారు. ఆ ముచ్చట రేపటి ఎపిసోడ్‌లో చూద్దాం.