: చైత్ర మాసం చివరి మంగళవారం కావడంతో భక్తులతో కళకళలాడాల్సిన ఓ ప్రముఖ ఆలయం.. ఒక్కసారిగా రక్తసిక్తమైంది. బీహార్‌లోని నలంద జిల్లాలో ఉన్న ప్రసిద్ధ శీతలా మాత ఆలయంలో మంగళవారం ఉదయం చోటుచేసుకున్న ఘోర తొక్కిసలాటలో ఎనిమిది మంది మహిళా భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో డజనుకు పైగా భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. బీహార్ షరీఫ్ నుంచి సుమారు ఐదు కిలో మీటర్ల దూరంలోని మఘ్రా గ్రామంలో ఉన్న ఈ ఆలయానికి చైత్ర మాసం చివరి మంగళవారం కావడంతో వేలాదిగా జనం తరలివచ్చారు. ఈక్రమంలోనే తొక్కిసలాట జరిగింది. నిమిషాల్లో ఎనిమిది మంది ప్రాణాలు గాల్లోకి..!సాధారణంగా మంగళ వారాల్లో ఈ ఆలయం భక్తులతో కిక్కిరిసి ఉంటుంది. పూజా కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతున్న సమయంలో.. ఒక్కసారిగా తోపులాట మొదలైంది. ఈక్రమంలోనే ఒకరి మీద ఒకరు పడిపోయారు. ఆపై అక్కడి నుంచి దూరంగా వెళ్లేందుకు కొందరు ప్రయత్నించగా తొక్కిసలాట జరిగింది. క్షణాల్లోనే పరిస్థితి మొత్తం అదుపు తప్పింది. కాసేపటికే పరిస్థితి అదుపులోకి రాగా.. కింద పడిపోయిన పలువురు మహిళలను భక్తులు గుర్తించారు. వారిని లేపేందుకు ప్రయత్నించారు. కానీ వారు స్పృహ తప్పి పడి ఉండడం చూసి సీపీఆర్ చేయడం, నీళ్లు చల్లడం వంటివి చేశారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. ఈక్రమంలోనే ఎనిమిది మంది మహిళలు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు వెల్లడించారు. మరో 12 మందికి పైగా గాయపడ్డారని చెప్పారు. వారికి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నామని.. స్పష్టం చేశారు.అధికారుల నిర్లక్ష్యమే కారణమా?ఈ ప్రమాదానికి అధికారుల నిర్వహణ లోపమే కారణమని భక్తులు మండిపడుతున్నారు. "మేము పాట్నా నుంచి దర్శనం కోసం వచ్చాము. జనం విపరీతంగా ఉన్నా ఇక్కడ కనీస పరిపాలన యంత్రాంగం కనిపించ లేదు. సరైన ఏర్పాట్లు లేకపోవడం వల్లే ఈ తొక్కిసలాట జరిగింది" అని మమతా దేవి అనే భక్తురాలు ఆవేదన వ్యక్తం చేశారు. బారికేడ్లు ఏర్పాటు చేసినప్పటికీ.. అంచనాకు మించి భక్తులు రావడంతో భద్రతా సిబ్బంది పరిస్థితిని అదుపు చేయలేక పోయినట్లు తెలుస్తోంది. తొక్కిసలాటపై ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి..ఈ ఘటనపై బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. బాధిత కుటుంబాలకు ఆర్థికంగా ఆదుకుంటామని ప్రకటించారు. మరణించిన వారి కుటుంబాలకు విపత్తు సహాయ నిధి నుంచి రూ. 4 లక్షలు, ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మరో రూ. 2 లక్షలు.. మొత్తంగా రూ. 6 లక్షల చొప్పున పరిహారం ఇస్తామన్నారు. అలాగే గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి కూడా ఈ ఘటనపై స్పందిస్తూ.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.