: ఆస్ట్రేలియా మాజీ ఫుట్ బాల్ ఆటగాడు అధికారికంగా భారత పౌరసత్వం పొందాడు. దీంతో అతడు త్వరలోనే భారత్ తరఫున ఫుట్ బాల్ ఆడనున్నాడు. ఈ మేరకు భారత్ ఫుట్ బాల్ టీమ్ క్యాంప్‌లో అతడు చేరిపోయాడు. అక్కడ మెరుగైన ప్రదర్శన చేస్తే.. ర్యాన్ విలియమ్స్ భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉంది. భారత్ పుట్‌బాల్ జట్టుకు ఇది నిజంగా గుడ్ న్యూస్ లాంటిదే.ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో జన్మించాడు విలియమ్స్. అయితే అతడి తల్లి ముంబైలోని ఆంగ్లో-ఇండియన్ కుటుంబానికి చెందినవారు. అంతేకాకుండా ర్యాన్ తాత లింకీ గ్రోస్టాట్ కూడా సంతోష్ ట్రోఫీలో బాంబేకు ప్రాతినిధ్యం వహించాడు. ఇవన్నీ.. ర్యాన్ భారత పౌరసత్వం పొందేందుకు సహాయపడ్డాయి. ర్యాన్ విలియమ్స్ ఆస్ట్రేలియా తరఫున అండర్-20, అండర్-23 స్థాయిలో ప్రాతినిధ్యం వహించాడు. అంతేకాకుండా ఆ దేశం తరఫున 2019లో దక్షిణ కొరియాతో మ్యాచ్ ఆడాడు.భారత్ తరఫున ఆడాలని భావించిన ర్యాన్ విలియమ్స్.. భారత పౌరసత్వం పొందేందుకు ప్రయత్నాలు ప్రారంభించాడు. కానీ విదేశీ పాస్ పోర్ట్ ఉన్నవారికి భారత పౌరసత్వం లభించదు. దీంతో తన ఆస్ట్రేలియా పాస్ పోర్ట్‌ను కూడా ర్యాన్ రద్దు చేసుకున్నాడు. భారత పౌరసత్వం పొందేందుకు ర్యాన్ చేసిన ప్రయత్నాలు త్వరగానే ఫలితాలు ఇచ్చాయి. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు నెలలు, కొన్నిసార్లు సంవత్సరాలు పట్టొచ్చు. ఇందుకు హోంమంత్రిత్వశాఖ అనుమతి కూడా అవసరం అవుతుంది. కానీ కేంద్రమంత్రి మన్‌సుఖ్ మాండవీయ చొరవతో ర్యాన్.. పౌరసత్వం పొందే ప్రక్రియ ఏడు నెలల్లోనే పూర్తయింది. మిగిలి ఉన్న లాంఛనాలు కూడా పూర్తయితే అతడు త్వరలోనే భారత్ తరఫున ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడనున్నాడు.తన పేస్, క్రాసింగ్, ఫినిషింగ్‌కు పేరుగాంచిన డైనమిక్ రైట్ వింగర్ అయిన ర్యాన్.. బెంగళూరు ఎఫ్‌సీలో సునీల్ ఛెత్రీతో పాటు కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. అతడు భారత ఫుట్‌బాల్ జట్టుకు మరింత బలంగా మారనున్నాడు. పోషించాడు. ర్యాన్ అభిరుచిని గమనించిన ఛెత్రీ.. అతడి రాక జట్టును మరింత బలంగా మార్చనుందని భావించాడు. అందుకే పౌరసత్వం పొందే ప్రక్రియ వేగవంతం కావడానికి కృషి చేశాడు. ఇక నేపాల్‌లో జన్మించిన డిఫెండర్ అబ్నీత్ కూడా త్వరలో భారత్ తరఫున ఆడనున్నాడు. అతడు గతంలోనే భారత్ పాస్ పోర్ట్ తీసుకున్నాడు.