TG: ఫోన్ ఇచ్చిన పాపానికి.. రూ.91 వేలు టోకరా.. రైల్వే స్టేషన్‌లో ఏం జరిగిందంటే..

Wait 5 sec.

తెలంగాణలో సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త పద్ధతిలో అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు. తాజాగా మెదక్ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకున్న ఒక సంఘటన.. ఇలాంటి వారు కూడా ఉన్నారా అనే సందేహం కలగక మానదు. అత్యవసరంగా ఫోన్ మాట్లాడాలని అడిగిన ఒక గుర్తు తెలియని వ్యక్తి తెలివిగా సిమ్ కార్డు మార్చి.. ఆ వ్యక్తి ఖాతా నుంచి రూ. 91,500 అపహరించాడు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను మెదక్ టౌన్ సీఐ మహేష్ వెల్లడించారు. కామారెడ్డి జిల్లా, సదాశివనగర్‌కు చెందిన దౌడగారి నీలం రెడ్డి తన భార్యతో కలిసి గత నెల 26న రైలులో మెదక్‌కు వచ్చారు. మెదక్ రైల్వే స్టేషన్‌లో ఉన్నప్పుడు.. ఒక గుర్తు తెలియని వ్యక్తి తన ఫోన్ పని చేయడం లేదని, అర్జెంట్‌గా ఫోన్ చేసుకోవాలని నీలం రెడ్డిని అడిగాడు. నీలం రెడ్డి దయతో తన ఫోన్ ఇవ్వగానే.. ఆ మోసగాడు ఫోన్ మాట్లాడుతున్నట్లు నటిస్తూ అత్యంత వేగంగా సిమ్ కార్డును మార్చివేశాడు. బాధితుడి ఫోన్‌లోని అసలు సిమ్ కార్డును తన సొంత ఫోన్ లోకి వేసుకున్నాడు. ఆ తర్వాత పని చేయని వేరే సిమ్ కార్డును నీలం రెడ్డి ఫోన్‌లో వేసి తిరిగి ఇచ్చేశాడు. మోసగాడు అపహరించిన సిమ్ ద్వారా బాధితుడి బ్యాంకు ఖాతాకు సంబంధించిన ఓటీపీలను స్వీకరించి.. క్షణాల్లో రూ. 91,500ను ఆన్‌లైన్‌లో ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడు. కొద్ది సమయం తర్వాత తన అకౌంట్ నుంచి డబ్బులు చోరీ అయినట్లు గుర్తించిన నీలం రెడ్డి, వెంటనే మెదక్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని పట్టుకోవడానికి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడి కదలికలను ట్రాక్ చేస్తున్నామని.. అన్ని కోణాల్లో చర్యలు తీసుకుంటున్నామని సీఐ మహేష్ తెలిపారు. సమాజంలో ఇలాంటి వారు కూడా ఉంటారని.. ఇటువంటి వ్యక్తుల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని.. గుర్తు తెలియని వ్యక్తులకు నమ్మి తమ ఫోన్‌లను ఇవ్వరాదని సీఐ మహేష్ హెచ్చరించారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్‌లు వంటి రద్దీ ప్రదేశాలలో ఇలాంటి మోసాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది.