సినీ కార్మికులకు శుభవార్త చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. వారి పిల్లలకు కూడా..

Wait 5 sec.

తెలంగాణ రాష్ట్రంలోజూబ్లీహిల్స్ శాసనసభ ఉపఎన్నిక ప్రచారం తుది దశకు చేరుకోవడంతో అధికార కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా సినిమా కార్మికులు, గిగ్ వర్కర్లను లక్ష్యంగా చేసుకుని కీలకమైన హామీలను ప్రకటించింది. సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చేసిన ప్రకటనలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. యూసఫ్‌గూడ చెక్‌పోస్ట్ వద్ద జరిగిన కార్నర్ మీటింగ్‌లో సీఎం రేవంత్ రెడ్డి సినిమా పరిశ్రమకు తన ప్రభుత్వం తరఫున ప్రత్యేక భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్‌ను గెలిపిస్తే.. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని సినిమా కార్మికులందరికీ ఆరోగ్య బీమా కల్పిస్తామని ప్రకటించారు. కార్మికుల పిల్లల కోసం పాఠశాల ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో నంది అవార్డులు కూడా ఇవ్వని కేసీఆర్, కేటీఆర్ సినీ కార్మికులను పట్టించుకోలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం గద్దర్ అవార్డులను ప్రకటించిందని గుర్తుచేశారు. అంతకుముందు, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కూడా తెలుగు ఫిల్మ్ క్లబ్‌లో మాట్లాడుతూ.. హైదరాబాద్‌కు సినీ పరిశ్రమను తరలించడంలో కాంగ్రెస్ ప్రభుత్వాల పాత్ర కీలకమని, అన్నపూర్ణ, పద్మాలయ వంటి స్టూడియోలకు భూములు కేటాయించి, చిత్రపురి కాలనీని ఏర్పాటు చేసిందే కాంగ్రెస్ అని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఏర్పాటుపై ప్రభుత్వం ఆలోచన చేస్తుందని తెలిపారు. గిగ్ వర్కర్లు, వారి భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేకంగా ఒక చట్టాన్ని తీసుకురాబోతున్నామని ప్రకటించారు. ఈ నెల 12న జరగబోయే క్యాబినెట్ సమావేశంలో ఈ బిల్లుకు ఆమోదం లభించనుంది. ఈ కొత్త చట్టం ద్వారా గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత, స్థిరమైన హక్కులు.. భవిష్యత్తు భద్రత కల్పించడానికి ప్రభుత్వం సమగ్రంగా పరిశీలిస్తుంది. ఈ బిల్లు రాహుల్ గాంధీ ఆలోచనల్లో భాగంగా రూపొందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా బీజేపీ, బీఆర్‌ఎస్‌ల మధ్య రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు. కాళేశ్వరంపై సీబీఐ ఎందుకు ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయలేదని ప్రశ్నించారు. పీజేఆర్ కుటుంబాన్ని అవమానించిన కేసీఆర్‌కు జూబ్లీహిల్స్‌లో ఓట్లు అడిగే హక్కు లేదన్నారు.