కలియుగ దైవం, వడ్డీకాసుల వాడు శ్రీవెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి.. భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తిరుమలకు రానున్నారు. ఈ నెల 21న రాష్ట్రపతి.. స్వామివారి సేవలో పాల్గొననున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ద్రౌపదీ ముర్ము తిరుపతికి రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఈ నెల‌ 20న రాష్ట్రపతి ముందుగా తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి తిరుమలకు చేరుకుంటారు. మరుసటి రోజు నవంబర్ 21న ఆలయ సంప్రదాయం ప్రకారం.. మొదట శ్రీ వరాహస్వామి వారిని, ఆ తర్వాత శ్రీవారి దర్శనం చేసుకుంటారు.రాష్ట్రపతి దర్శన ఏర్పాట్లపై సమీక్ష..రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లపై దృష్టి సారించారు. ఈ మేరకు గురువారం (నవంబర్ 6న) తిరుమలలోని పద్మావతి విశ్రాంతి భవనంలోని సమావేశ మందిరంలో.. ఉన్నతస్థాయి రివ్యూ మీటింగ్ నిర్వహించారు. టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ మీటింగ్‌లో సీవీఎస్వో మురళీకృష్ణతో పాటు ఇతర విభాగాల అధిపతులు పాల్గొన్నారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా భద్రత, వసతి, దర్శన ఏర్పాట్లపై వారు చర్చించారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా.. పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలని అధికారులకు అదనపు ఈవో ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో ఎస్వీబీసీ సీఈఓ శ్రీ ఫణికుమార్ నాయుడు, సీఈ శ్రీ సత్యనారాయణ, అదనపు ఎస్పీ శ్రీ రామకృష్ణ తదితర అధికారులు పాల్గొన్నారు.అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉండి.. శబరిమల ఆలయాన్ని సందర్శించిన తొలి రాష్ట్రపతిగా ముర్ము అరుదైన (Droupadi Murmu Sabarimala Visit) రికార్డును సొంతం చేసుకున్నారు. పంబా నది ప్రాంతం నుంచి పద్ధతి ప్రకారం ఇరుముడిని తలపైన ధరించిన ఆమె.. ప్రొటోకాల్ పక్కన పెట్ట మరీ రాష్ట్రపతి అయ్యప్ప ఆలయానికి చేరుకోవడం గమనార్హం. ఆలయ ప్రధాన ద్వారం వద్దకు రాష్ట్రపతి చేరుకోగానే.. దేవస్థానం అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగానే అయ్యప్ప దర్శన ఆచారాలను అన్నీ పాటిస్తూ.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాల ధరించి ఇరుముడితో.. పవిత్రమైన 18 మెట్లు ఎక్కి అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్నారు. అక్కడ స్వామివారికి ఇరుముడిని సమర్పించి.. రాష్ట్రపతి ప్రత్యేక పూజలు నిర్వహించారు.