'కర' మూవీ రివ్యూ - రాబిన్‌‌హుడ్ కాన్సెప్టే కానీ..!

Wait 5 sec.

తెలుగులో ధనుష్ మూవీకి మంచి క్రేజ్ ఉంటుంది. తమిళంలో ఎంత గ్రాండ్‌గా రిలీజ్ అవుతుందో.. తెలుగులోనూ ఇంచు మించు అదే స్థాయిలో రిలీజ్ అవుతుంది. ఏడాది మూడు, నాలుగు సినిమాల్ని ధనుష్ అందిస్తున్నారు. ఇప్పుడు ‘కర’ అంటూ ఆడియెన్స్ ముందుకు వచ్చారు. ‘పోరు తొళిల్’తో అందరినీ ఆకట్టుకున్న విఘ్నేశ్ రాజా ఈ ‘కర’ మూవీకి దర్శకుడు. ఇందులో మమిత బైజు హీరోయిన్‌గా నటించారు. మరి ఈ కాంబోలో వచ్చిన ఈ ‘కర’ చిత్రం ఎలా ఉంది? అన్నది ఓ సారి చూద్దాం.కథకరసామి (ధనుష్)కి తాళం పగలగొట్టడం, గోడలు దూకడం, దొంగతనం చేయడం తప్పా ఇంకేమీ రాదు. యుక్తవయసులో నాన్న దగ్గర డబ్బులు దొంగిలించి ఊరు వదిలి వెళ్లిపోతాడు. వల్లి (మమిత బైజు)ని కర సామి పెళ్లి చేసుకుంటాడు. చివరి దొంగతనం అని చెప్పి ఎమ్మెల్యే ఇంట్లో దొంగతనం చేసేందుకు వెళ్తాడు కరసామి. ఈ కేసుని డీఎస్పీ భరతన్ (సూరజ్ వెంజరమూడు) పర్సనల్‌గా తీసుకుంటాడు. అయితే డీఎస్పీని కొట్టి కరసామి తప్పించుకుంటాడు. ఆ తరువాత దొంగతనాలన్నీ మానేసి వల్లి (మమితా బైజు)తో కలిసి హోటల్‌లో పని చేసుకుంటూ ఉంటాడు కర. సొంతంగా హోటల్ పెట్టుకోవాలని అనుకుంటాడు. కానీ డబ్బు ఎక్కడా దొరకదు. బ్యాంకులో లోను అడిగితే షూరిటీ కావాలని, ఆస్తి పత్రాలు కావాలని అడుగుతారు. దీంతో తన సొంతూర్లో ఉన్న 8 ఎకరాల పొలం కోసం వెళ్తాడు. అయితే అప్పటికే బ్యాంకులో తీసుకున్న రుణం, వాటి వడ్డీ కట్టలేక ఊరంతా అష్టకష్టాల్లో ఉంటుంది. పొలాన్ని ప్రాణంగా చూసుకునే కందసామి (కేఎస్ రవి కుమార్) కూడా పంచవన్ యూనియన్ బ్యాంకులో రుణం తీసుకుంటాడు. ఇన్నేళ్ల తరువాత కూడా తమని చూడటానికి కాకుండా, పొలం, డబ్బుల కోసం కొడుకు వచ్చాడని తెలిసి కందసామి బాధతో కుంగిపోయి మరణిస్తాడు. తన పొలంలోనే తన శవాన్ని పూడ్చాలనేది కందసామి చివరి కోరిక. కానీ బ్యాంక్ వాళ్లు మాత్రం అందుకు ఒప్పుకోరు. జప్తు చేసిన భూమిలో శవాన్ని ఎలా పాతిపెడతారని గొడవ చేస్తారు.మరి తండ్రి పార్థివదేహాన్ని కరసామి ఏం చేస్తాడు? పంచవన్ యూనియన్ బ్యాంకు, బ్యాంక్ మేనేజర్ ముత్తు సెల్వన్ (జయరాం) చేస్తున్న మోసాన్ని కర ఎలా తిప్పి కొడతాడు? దొంగతనాలు మానేసిన కర మళ్లీ ఏం చేస్తాడు? చివరకు తన నాన్న చివరి కోరికను తీర్చాడా? ఊరి ప్రజలందరికీ కర చేసిన సాయం ఏంటి? చివరకు పోలీస్ ఆఫీసర్ డీఎస్పీ భరతన్‌కి కర చిక్కుతాడా? అన్నది థియేటర్లో చూడాల్సిందే.కర మూవీకి 90వ దశకాన్ని నేపథ్యంగా ఎంచుకోవడం కలిసి వచ్చిన అంశం. ఈ కథలో విఘ్నేశ్ రాజా చాలా లేయర్స్‌ని ప్లాన్ చేసుకున్నాడు. స్ట్రెయిట్‌గా ఈ మూవీని ఓ రాబిన్ హుడ్ మోడల్‌లో చూపించొచ్చు. ఉన్న వాళ్ల దగ్గర దోచేసి.. లేనివాళ్లకు పెట్టడం అనే ఈ రాబిన్ హుడ్ కాన్సెప్ట్‌తోనే ఈ ‘కర’ సాగుతుంది. అయితే విఘ్నేశ్ రాజా మాత్రం ఈ పాయింట్‌ను చాలా ఇంట్రెస్టింగ్‌గా, కొత్తగా చెప్పే ప్రయత్నం చేశాడు. కరని పరిచయం చేయడమే ఓ దొంగగా.. ఇదే తన చివరి దొంగతనం.. ఇకపై మంచిగా బతికేస్తాను అన్నట్టుగా చూపించడంతో మొదటి సీన్ నుంచే సినిమాలో లీనమయ్యేలా చేశాడు దర్శకుడు.ఫస్ట్ హాఫ్ అంతా కర నిస్సహాయతనే చూపిస్తాడు. ఇంటర్వెల్ వరకు కరకి డబ్బు దొరుకుతుందా? లేదా? ఈ కష్టాలు తీరుతాయా? లేదా? అని ఆడియెన్స్ అనుకుంటాడు. ఇక ఇంటర్వెల్‌కి ముందు బ్యాంకులో వచ్చి ఎపిసోడ్‌ని మాత్రం ఊపిరి బిగపట్టుకుని చూసేలా ఉంటుంది. ఎక్కడ దొరికిపోతాడ్రా బాబు అన్నట్టుగా ఉంటుంది. అప్పటి వరకు నెమ్మదిగా, నిదానంగా సాగిన ఈ సినిమా ఇంటర్వెల్‌కి అద్భుతంగా అనిపిస్తుంది. కీలకమైన సెకండాఫ్ చాలా వరకు పరుగులు పెట్టినట్టుగా అనిపిస్తుంది.డీఎస్పీ భరతన్ ఎంట్రీ ఇచ్చాక మరింత ఇంట్రెస్టింగ్‌గా మారుతుంది. బ్యాంకుల దొంగతనాలు, కరని పట్టుకునేందుకు పోలీస్ వేసే ప్లాన్స్, మధ్యలో బ్యాంక్ మేనేజర్ చేసే కాపీ క్యాట్ దొంగతనాలు ఇలా అన్నీ బాగుంటాయి. అయితే వరుసగా దొంగతనాలు చేస్తూ వెళ్లడం అనేది కాస్త నమ్మేట్టుగా అనిపించదు. ఇక ప్రీ క్లైమాక్స్‌కి మరింత ఎమోషనల్‌గా సాగుతుంది. చివరకు ఊరి ప్రజలందరి కోసం రాబిన్ హుడ్‌లా కర మారడంతో కథకు హ్యాపీ ఎండింగ్ ఇచ్చినట్టు అనిపిస్తుంది. చివర్లో కర, పోలీస్ ఆఫీసర్ భరతన్ మధ్య జరిగే సంభాషణ కూడా బాగుంటుంది.నటీనటుల విషయానికి వస్తే ధనుష్‌కు ఇలాంటి ఓ ఎమోషనల్ పాత్రలు కొట్టినపిండి. ధనుష్ తన నటనతో ఆడియెన్స్‌ని కొన్ని చోట్ల ఏడ్పించేస్తారు. సింపుల్ లుక్స్‌తో ధనుష్ ఆకట్టుకుంటారు. మమిత బైజుకి అంత గొప్ప ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలా అనిపించదు. కానీ ఆమె లుక్స్ మాత్రం ఆశ్చర్యకరంగా ఉంటాయి. అచ్చం ఓ పల్లెటూరిపిల్లలా కనిపిస్తుంది. కనిపించే ఐదారు సీన్లలో మమిత మెప్పిస్తారు. కేఎస్ రవి కుమార్ పాత్ర చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. సూరజ్ వెంజరమూడు కారెక్టర్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. జయరాంకి రెగ్యులర్ విలన్ పాత్ర లభించినట్టుగా అనిపిస్తుంది. కరుణాస్ పాత్ర కూడా బాగుంటుంది. మిగిలిన పాత్రలు కూడా పరిధి మేరకు ఆకట్టుకుంటాయి.టెక్నికల్‌గా చూసుకుంటే 90వ దశకాన్ని, ఆ వాతావరణాన్ని తెరపై తీసుకు రావడంలో సక్సెస్ అయ్యారు. జీవీ ప్రకాష్ ఆర్ఆర్ బాగుంటుంది. పాటలు అయితే అంత గుర్తు పెట్టుకునేలా, మళ్లీ మళ్లీ పాడుకునేలా అయితే ఉండవనిపిస్తుంది. మాటలు కొన్ని చోట్ల హత్తుకుంటాయి. విజువల్స్ ఎంతో నేచురల్‌గా, యాక్షన్ సీక్వెన్స్ సింపుల్‌గా ఉంటాయి. నిర్మాణ పరంగా ఈ సినిమా రిచ్‌గా ఉంటుంది.‘కర’ మూవీ.. ఓ రెగ్యులర్ మాస్ మసాలా కమర్షియల్ సినిమా అయితే కాదు. కొన్ని చోట్ల నిదానంగా, బోరింగ్‌గా అనిపిస్తుంది. రైతులు, బ్యాంకులు అంటూ మంచి పాయింట్‌ను విఘ్నేశ్ రాజా చెప్పే ప్రయత్నం చేశాడు. మరి ఈ ప్రయత్నానికి కమర్షియల్‌గా ఎలాంటి సక్సెస్ వస్తుంది అనేది చూడాలి.