టీటీడీ పదో తరగతి పాసైన విద్యార్థుల కోసం అద్భుతమైన అవకాశం కల్పిస్తోంది. టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రారంభమయ్యాయి. టీటీడీ సాంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్పకళను సంరక్షిస్తూ, భవిష్యత్ తరాలకు అందించడానికి.. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర సాంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్పకళాశాలను నిర్వహిస్తోంది. 4 ఏళ్ల డిప్లొమా కోర్సు, 2 ఏళ్ల సర్టిఫికేట్ కోర్సులకు మే 4వ తేదీ నుంచి జూన్ 20వ తేదీ వరకు దరఖాస్తులను జారీ చేసి, స్వీకరించనున్నారు. ఈ కోర్సుల్లో చేరడానికి పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి ఉన్నవారు దరఖాస్తులను నేరుగా కాలేజీలో పొందవచ్చు. టిటిడి వెబ్ సైట్‌లో డౌన్లోడ్ చేసుకుని పూర్తి చేసిన దరఖాస్తులను జూన్ 20వ తేదీ సాయంత్రం లోపు అందజేయాలని టీటీడీ సూచిస్తోంది.టీటీడీ శ్రీ వేంకటేశ్వర శిల్పకళాశాలలో ప్రవేశం పొందిన విద్యార్థుల పేరిట రూ.1 లక్షను జాతీయ బ్యాంకులో డిపాజిట్ చేస్తుంది. ఈ డబ్బుల్ని కోర్సు పూర్తి చేసిన తరువాత నిబంధనల ప్రకారం వడ్డీతో సహా విద్యార్థులకు అందజేస్తారు. కోర్సుల విషయానికి వస్తే డిప్లొమా ఇన్ ట్రెడిషనల్ స్కల్ప్చర్ (4 ఏళ్లు). రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ, ఏఐసీటీఈ అనుమతితో నిర్వహించే ఈ కోర్సులో 6 విభాగాలు ఉన్నాయి. ఆలయ నిర్మాణం, శిలా శిల్పం, సుధా శిల్పం, లోహ శిల్పం, కొయ్య శిల్పం, సంప్రదాయ వర్ణచిత్ర లేఖనం వంటి కోర్సులు ఉన్నాయి.1960లో స్థాపించబడిన ఈ శిల్పశిక్షణ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో ఏకైకంగా నిలిచి, భారతీయ సాంప్రదాయ ఆలయ నిర్మాణం, వాస్తు, శిల్పకళలో నైపుణ్యంతో కూడిన శిల్పులను తీర్చిదిద్దుతోంది. భారతీయ సంస్కృతి, వారసత్వ పరిరక్షణలో విద్యార్థులను మార్గనిర్దేశం చేస్తోంది. ప్రతి విభాగంలో ఏడాదికి 10 మంది చొప్పున, మొత్తం 60 మందికి ప్రవేశం కల్పిస్తారు. విద్యార్థులకు ఉచిత వసతి, భోజన సౌకర్యం అందుబాటులో ఉంటుంది. చివరి సంవత్సరం విద్యార్థులకు దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ ఆలయాల సందర్శన కూడా కల్పిస్తారు.అంతేకాదు సంప్రదాయ కలంకారి కళ (2 సంవత్సరాల సర్టిఫికేట్ కోర్సు) కూడా ఉంది. వస్త్రాలపై సంప్రదాయ చిత్రకళలో శిక్షణనిచ్చే ఈ కోర్సులో ప్రతి సంవత్సరం 10 మందికి ప్రవేశం కల్పిస్తారు. ఉచిత వసతి, భోజనంతో పాటు స్వయం ఉపాధి అవకాశాలు విస్తారంగా ఉన్నాయి. దేశ విదేశాల్లో కలంకారి కళకు మంచి డిమాండ్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వ విధానాల ప్రకారం ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక జరుగుతుంది. అర్హులైన అభ్యర్థులు మే 04 నుంచి జూన్ 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ సంస్థలో శిక్షణ పొందిన వారు టీటీడీ ఆలయ నిర్మాణ, పునర్నిర్మాణ విభాగాల్లో స్థపతులు, టెక్నికల్ అసిస్టెంట్లు, కాంట్రాక్టర్లు దేవాదాయ, పర్యాటక, పురావస్తు శాఖల్లో ఉద్యోగాలు పొందుతున్నారు. అంతేకాక, జాతీయ స్థాయిలో అనేక అవార్డులు అందుకుంటున్నారు. ఈ కళాశాలలో అడ్మిషన్‌లో కంసం శ్రీ వేంకటేశ్వర సంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్పశిక్షణ సంస్థ, తిరుమల తిరుపతి దేవస్థానములు, అలిపిరి రోడ్, తిరుపతి – 517507ను సంప్రదించాలని టీటీడీ సూచించింది. అలాగే టీటీడీ అధికారిక వెబ్‌సైట్: www.tirumala.org, ఫోన్: 0877-2264637 ద్వారా సంప్రదించాలని సూచించారు.