ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి ఫలితాలను గురువారం వెల్లడించారు. విద్యా శాఖ మంత్రి . ఈ సంవత్సరం టెన్త్ క్లాసులో 85.15 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఎప్పటిలాగే అబ్బాయిల కంటే అమ్మాయిలు ఎక్కువ శాతం పాసయ్యారు. గవర్నమెంట్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులు సైతం కార్పొరేట్ స్కూళ్లలో చదువుతూన్న విద్యార్థులకు ధీటుగా మార్కులు సాధించారు.దీంతో ఏపీ ప్రభుత్వం, పాఠశాల విద్యా శాఖ.. సగర్వంగా నిల‘బడి’ అంటూ.. ప్రభుత్వ బడులను ప్రమోట్ చేస్తూ దినపత్రికల్లో ప్రకటనలు ఇచ్చింది. సర్కారు బడుల్లో చదివినప్పటికీ స్టేట్ ర్యాంక్ స్థాయి మార్కులు సాధించిన విద్యార్థుల (విద్యార్థినులు అనాలేమో.. ఎందుకంటే 13 మందిలో ఒక్కరే అబ్బాయి, మిగతా అందరూ అమ్మాయిలే) ఫొటోలు, వారు సాధించిన మార్కులు, చదువుకున్న పాఠశాల వివరాలను ఈ ప్రకటనలో ప్రచురించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన నలుగురు విద్యార్థినులకు ఏకంగా 596 మార్కులు రాగా.. 9 మంది 595 మార్కుల చొప్పున సాధించడం విశేషం.మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలుపుతూ.. ఇందుకు కారణమైన టీచర్లు, సిబ్బందికి విద్యాశాఖ ధన్యవాదాలు తెలిపింది. ‘అమ్మలా శిక్షణ.. నాన్నలా రక్షణ.. స్నేహపూర్వక బోధన.. ప్రభుత్వ బడుల్లో పిల్లలను చేర్పించండి.. వారి బంగారు భవితకు బాటలు వేయండి’ అని ఏపీ విద్యా శాఖ పిలుపునిచ్చింది.ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచడానికి, విద్యార్థులను మెరికల్లా తీర్చిదిద్దడానికి ఏపీ ప్రభుత్వం (ప్రభుత్వాలు) గత కొన్నేళ్లుగా వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. జగన్ హయాంలో ‘నాడు-నాడు’ కార్యక్రమంతో పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపర్చే ప్రయత్నం జరిగింది. అమ్మ ఒడి పేరిట విద్యార్థుల తల్లుల ఖాతాలో ఏటా రూ.15 వేల చొప్పున జమ చేశారు.కూటమి ప్రభుత్వం విద్యా రంగం స్వరూపాన్ని మార్చేస్తోంది. విద్యార్థుల సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ఏఐ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఒత్తిడికి గురి చేయకుండా.. విద్యార్థులు ఆటపాటలతో నేర్చుకునేలా విద్యాబోధన చేస్తున్నారు. ఉపాధ్యాయులు బోధన పద్ధతుల్లో వస్తున్న మార్పులను అందిపుచ్చుకునేలా చూడటం కోసం వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఏఐ టెక్నాలజీ, డిజిటల్ టూల్స్ వినియోగంపై వర్క్ షాప్‌లు నిర్వహిస్తున్నారు. 2029 నాటికి విద్యారంగంలో ఏపీని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో నారా లోకేశ్ ఆధ్వర్యంలో విద్యాశాఖ అధికారులు పని చేస్తున్నారు.ప్రభుత్వ బడుల్లో.. గ్రామీణ ప్రాంతాల్లో చదివిన ఈ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించడం ద్వారా.. లక్షలు ఖర్చు చేసి కార్పొరేట్ స్కూళ్లలో చదివేస్తేనే మంచి మార్కులు వస్తాయనే భ్రమలు తగ్గేలా చేశారు. డబ్బు లేకున్నా నాణ్యమైన విద్యను సర్కారు బడుల్లోనే పొందొచ్చని నిరూపించారు.