ఇరాన్ నాయకత్వంలో భగ్గుమన్న విబేధాలు.. విదేశాంగ మంత్రిని తొలగించే యోచనలో అధ్యక్షుడు

Wait 5 sec.

అమెరికాతో శాంతి చర్చల్లో ప్రతిష్ఠంభన కొనసాగుతున్న తరుణంలోఈ నేపథ్యంలో విదేశాంగ మంత్రి అబ్బాసీ అరాఘ్చీని పదవి నుంచి తొలగించేందుకు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్, పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాఘేర్ గాలిబాఫ్‌లు సిద్ధమయ్యారంటూ ఇరాన్ ఇంటర్నేషనల్ ప్రకటించిన నివేదిక సంచలనంగా మారింది.ఆదేశాలను పక్కనబెట్టి.. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్స్స్‌ (IRGC) సూచనలను అరాఘ్చీ పాటిస్తున్నారని ఇరువురు నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నట్టు నివేదిక పేర్కొంది.గత రెండు వారాలుగా విదేశాంగ మంత్రి తమను పట్టించుకోవడం లేదని, ఆయన క్యాబినెట్ సభ్యుడిగా కాకుండా ఐఆర్జీసీ కమాండర్ అహ్మద్ వహిదికి సహాయకుడిలా వ్యవహరిస్తున్నారని పెజిష్కియాన్, గాలిబాఫ్‌ల భావిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలను ఉటంకించింది. అధ్యక్షుడు పెజెష్కియాన్‌‌కి సమాచారం ఇవ్వకుండా.. ఐఆర్జీసీ చీఫ్ ఆదేశాల మేరకు అరాఘ్చీ వ్యవహరిస్తున్నారని వర్గాలు తెలిపాయి. దీంతో ఆగ్రహానికి గురవుతున్న పెజెష్కియాన్‌, ఇది ఇలాగే కొనసాగితే అరాఘ్చీని పదవి నుంచి తొలగిస్తానని తన సహచరులకు చెప్పినట్లు ఆ నివేదిక పేర్కొంది. అయితే, ఈ విషయంపై ఇరాన్ నుంచి ఇప్పటి వరకూ ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు. ఇరాన్ నాయకత్వంలో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నట్టు ఇటీవల నివేదిక నేపథ్యంలో ఈ తాజా పరిణామాలు చోటుచేసుకున్నాయి. పెజెష్కియాన్, వాహిదీల మధ్య ఉన్న విభేదాలపై ఇరాన్ ఇంటర్నేషనల్ మార్చి 28న మొదటిసారిగా నివేదించింది. యుద్ధ నిర్వహణ తీరుపై అధ్యక్షుడు, ఐఆర్జీసీ చీఫ్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్టు సమాచారం. ఈ విబేధాలు దేశ ఆర్థిక వ్యవస్థ, యుద్ధం వల్ల ప్రజల జీవనోపాధిపై ప్రభావం చూపుతున్నాయి.బలహీనంగా ఉన్న కాల్పుల విరమణను శాశ్వత ఒప్పందంగా మార్చేందుకు అమెరికా‌తో జరగాల్సిన చర్చల ప్రతిష్టంభనకు ఇరాన్ నాయకత్వ సంక్షోభం కూడా ఒక కారణంగా పరిగణిస్తున్నారు. చర్చల కోసం ఇస్లామాబాద్ వెళ్లిన ఇరాన్ ప్రతినిధి బృందానికి ఒప్పందం కుదుర్చుకోడానికి పూర్తి అధికారం లేకపోవడంపై అమెరికా నిరాశ చెందినట్టు ఇజ్రాయెల్‌కు చెందిన ఓ నివేదిక అభిప్రాయపడింది. అలాగే, ఏదైనా ఒప్పందాన్ని ఖరారు చేయడానికి ఇరాన్ ప్రతినిధులకు ఐఆర్జీసీ నుంచి పూర్తి అధికారం ఉండాలని అమెరికా స్పష్టం చేసింది.చర్చల్లో పాల్గొన్న ప్రతినిధి బృందాన్ని అమెరికా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా ఐఆర్జీసీ చీఫ్ అహ్మద్ వాహిది, మరో ముఖ్య అధికారి అలీ అబ్దుల్లాహి అడ్డుకున్నారని పేర్కొంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్న పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బఘేర్ ఘాలిబాఫ్.. ఇరాన్‌ను పూర్తి ఆర్థిక పతనం నుంచి కాపాడాలని అధ్యక్షుడు పెజెష్కియన్‌ను డిమాండ్ చేసినట్లు సమాచారం.