ఏపీ ముఖ్యమంత్రి నారా నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను పరామర్శించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌ రోడ్ నంబర్ 35లోని పవన్ నివాసానికి వెళ్లిన చంద్రబాబు.. గురించి వాకబు చేశారు. గత నెలలో ముక్కుకు సర్జరీ చేయించుకున్న పవన్ కళ్యాణ్.. అప్పటి నుంచి హైదరాబాద్‌లో ఉన్న తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన చంద్రబాబు.. ఆయన ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ఏప్రిల్ నెలలో పాలనాపరమైన అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్న సమయంలో డిప్యూటీ సీఎం అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆసుపత్రికి వెళ్లగా.. డాక్టర్లు పరీక్షలు నిర్వహించి, పవన్ కళ్యాణ్‌కు సైనసైటిస్ శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు. అనంతరం హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో పవన్ కళ్యాణ్‌కు సర్జరీ నిర్వహించారు. ఆపరేషన్ అనంతరం పది రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అలాగే దీర్ఘకాలం పాటు ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని పవన్ కళ్యాణ్‌కు వైద్యులు సూచించారు. ఈ నేపథ్యంలో వైద్యుల సలహా మేరకు పవన్ కళ్యాణ్ గత 10 రోజులుగా హైదరాబాద్‌లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లి ఆయన ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. గతంలోనూ పవన్ కళ్యాణ్ జ్వరంతో బాధపడుతున్న సమయంలో చంద్రబాబు ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. మరోవైపు సైనసైటిస్ సమస్యతో పవన్ కళ్యాణ్ చాలా కాలంగా ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికల సమయం నుంచి పలుమార్లు అనారోగ్యానికి గురయ్యారు. ఈ క్రమంలోనే డాక్టర్ల సిఫార్సు మేరకు సర్జరీ చేయించుకున్నారు. మరోవైపు పారిశ్రామికవేత్త, రీజెన్సీ గ్రూప్ అధినేత జీఎన్ నాయుడు కుటుంబాన్ని కూడా చంద్రబాబు పరామర్శించారు. హైదరాబాద్ నందిహిల్స్‌లోని జీఎన్ నాయుడు ఇంటికి వెళ్లిన చంద్రబాబు.. జీఎన్ నాయుడు పార్ధివ దేహానికి నివాళులర్పించారు. తెలుగు ప్రజలు మంచి పారిశ్రామికవేత్తను కోల్పోయారని, రీజెన్సీ స్థాపనతో యువతకు ఉపాధి కల్పనలో జీఎన్ నాయుడు కృషి ఎనలేనిదని సీఎం కొనియాడారు.