ఏపీలో పండుతున్న జపాన్ మామిడి.. కిలో రూ.2.70 లక్షలు, టీడీపీ ఎమ్మెల్యే ఇంట్లో చెట్టు

Wait 5 sec.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండుగా.. జపాన్‌కు చెందిన మియాజాకి మామిడి పండ్లను చెబుతారు. జపాన్‌లో పండించే ఈ పండ్లు అంతర్జాతీయ మార్కెట్‌లో కిలో ధర రూ.2.70 లక్షల వరకు ఉంటుంది. ముదురు ఎరుపు, పర్పుల్ రంగులో ఉండే ఈ మియాజాకీ మామిడి పండు.. చాలా తీయగా, అస్సలు గుజ్జు లేకుండా ఉంటుంది. జెల్లీ లాంటి గుజ్జు కలిగి ఉండి.. 15 శాతానికి పైగా షుగర్ లెవల్స్‌తో.. తింటే అమృతం లాగా ఉంటుంది. ఈ మియాజాకీ మామిడి పండును.. తాయో నో తమగో అని.. ఎగ్ ఆఫ్ ద సన్ అని కూడా పిలుస్తారు. ఇక ఈ జపాన్ రకం మియాజాకీ మామిడి.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో పండిస్తున్నారు. హనుమాన్‌ జంక్షన్‌లో పుట్టిగుంట సతీష్ కుమార్ బిజినెస్‌మెన్ తన ఫాంహౌస్‌లో ఈ మియాజాకీ మామిడి పంటను పండిస్తున్నారు. పంట పండించడమే కాకుండా మంచి దిగుబడిని కూడా సాధిస్తున్నారు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 100 మామిడిపండ్లను కోసినట్లు వెల్లడించారు. ఈ మియాజాకీ మామిడి పండ్ల గురించి తాను యూట్యూబ్‌లో చూసి తెలుసుకున్నట్లు సతీష్ కుమార్ చెప్పారు. జపాన్‌‍లో పుట్టినప్పటికీ.. దీన్ని చాలా దేశాల్లో పండిస్తున్నారని పేర్కొన్నారు. తన స్నేహితుడు థాయ్‌లాండ్ నుంచి ఒక 10 మియాజాకీ మొక్కలను తెప్పించి తనకు ఇచ్చారని తెలిపారు. ఆ 10 మొక్కల్లో కొన్ని ఫాంహౌస్‌లో మరికొన్ని తన ఫ్రెండ్స్ ఇళ్లలో పెట్టినట్లు చెప్పారు. 3 ఏళ్ల నుంచి 4 ఏళ్ల వయసు ఉన్న మొక్కను తెచ్చి పెట్టామని.. ఇప్పుడు అన్నీ కాపు కాశాయని పేర్కొన్నారు. ఇవి సాధారణ మామిడి పండ్లలా కాకుండా చాలా భిన్నమైన రుచి కలిగి ఉన్నాయని తెలిపారు. తన ఫాంహౌస్‌లో 3 మియాజాకీ మామిడి చెట్లను పెంచగా.. మొత్తం కలిపి 100 మామిడికాయలు వచ్చినట్లు చెప్పారు. పార్వతీపురం మన్యం జిల్లాలో కూడా ఒక రైతు ఈ మియాజాకీ మామిడి పండ్లను సాగు చేసి.. ఒక్కో మామిడిపండును రూ.10 వేలకు విక్రయించారు. తిరుపతి, కడప రైతులు కూడా వీటిని పండించేందుకు రెడీ అవుతున్నారు. అదే సమయంలో విజయవాడ నగరంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు.. తన ఇంట్లో కూడా ఈ మియాజాకీ మామిడి చెట్టును పెంచుతుండటం విశేషం. ఈ మియాజాకీ మామిడి పండ్లను కొనుగోలు చేయాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. సాధారణంగా మామిడి పండ్లు కిలోకు రూ.150 నుంచి మొదలవుతాయి. కానీ ఈ మియాజాకీ మామిడి పండ్లు కిలోకు ఏకంగా అక్షరాలా రూ.2.70 లక్షలు కావడంతో సామాన్య ప్రజలు కొనే పరిస్థితి లేదు. జపాన్‌లో ఈ మియాజాకీ మామిడి పండ్లను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి వేలం పాట వేసి విక్రయిస్తారు. ఈ మియాజాకీ మామిడి పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, బీటా కెరోటిన్ మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని నిపుణులు చెబుతారు.