కాంగ్రెస్ సీనియర్ నేత, తన వ్యాఖ్యలతో మాత్రమే కాకుండా తన దాతృత్వ గుణంతో కూడా తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు భారీగా ఆర్థిక సాయం చేశారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న చిన్నారికి తక్షణమే రూ.1 లక్ష.. అవయవాలు చెడిపోయి బాధపడుతున్న మరో చిన్నారికి రూ.2.5 లక్షల ఆర్థిక సాయం అందించారు. వీటితోపాటు.. ఇంటర్‌లో మెరిసిన 151 మంది విద్యార్థులకు రూ.24.5 లక్షల బహుమతులు అందించారు. ఈ ఘటనతో కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలబడే నాయకుడు అని ఎమ్మెల్యే నిరూపించారు. ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించేందుకు నల్గొండ జిల్లాలో ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో పాల్గొన్న మునుగోడు ఎమ్మెల్యే తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఈ సమావేశంలో నిరుపేద కుటుంబాలకు చెందిన 151 మంది విద్యార్థులకు.. దాదాపు రూ.24.5 లక్షల ప్రోత్సాహక బహుమతులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆ విద్యార్థుల ఉన్నత చదువులకు భరోసానిచ్చారు.అయితే ఈ సమావేశంలో ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. తన తమ్ముడికి క్యాన్సర్‌ సోకిందని.. అతడు గత కొన్ని రోజులుగా ఆ వ్యాధితో పోరాడుతున్నాడని శివాని అనే విద్యార్థిని ఎమ్మెల్యే కోమటిరెడ్డి ముందు తన గోడును వెళ్లబోసుకున్నాడు. తమ కుటుంబ పరిస్థితి బాగోలేదని ఆమె కన్నీరు పెట్టుకుంది. ఆ చిన్నారి బాధను చూసి తీవ్రంగా చలించిపోయిన రాజగోపాల్ రెడ్డి.. వెంటనే రూ.లక్ష సాయం ప్రకటించారు. అంతేకాకుండా మరో రూ.2.5 లక్షల ఎల్ఓసీ మంజూరు చేసి.. వారి కుటుంబంలో ధైర్యాన్ని నింపారు.అయితే ఈ సమావేశంలో ఒక్క శివాని కుటుంబానికి మాత్రమే కాకుండా.. మునుగోడుకు చెందిన చిన్నారి మోక్షిత్‌కు కూడా ఎమ్మెల్యే కోమటిరెడ్డి అండగా నిలిచారు. మల్టీ ఆర్గాన్ వ్యాధితో బాధపడుతున్న ఓ బాలుడి చికిత్స కోసం రూ.2.5 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఆ బాలుడికి మెరుగైన వైద్యం అందించేందుకు రెయిన్‌బో ఆస్పత్రిలో చికిత్స చేయిస్తామని భరోసా ఇచ్చారు.ఈ సందర్భంగా కష్టాల్లో ఉన్నామని వేడుకున్న ప్రతీ ఒక్కరినీ ఆత్మీయంగా పలకరించే ఎమ్మెల్యే కోమటిరెడ్డి.. తాజాగా వేదికపైనే ఆర్థిక సాయం ప్రకటించడంతో సర్వత్రా ప్రశంసలు వ్యక్తం అవుతున్నాయి. ఆపదలో ఉన్న పేదవారికి అండగా నిలిచిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి.. నిజమైన ప్రజా సేవకుడు అని మరోసారి చాటి చెప్పారని అంతా పేర్కొంటున్నారు.