కూటి కోసం కోటి కష్టాలు అనేది పెద్దలు చెప్పేమాట. కానీ ఇక్కడ మనం చెప్పుకోబోయే విషయంలో మాత్రం అది వేరే. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలోని బొంగిజ అనే గ్రామంలోని ప్రజలు.. రోజూ కొండెక్కుతున్నారు. అదేంటి అక్కడేమైనా ఆలయం ఉందా.. లేదా వ్యాయామం కోసం ఊరిజనం ఈ అలవాటు చేసుకున్నారా అని బుర్రలు బద్దలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీరందరూ అటెండెన్స్ కోసం ఇలా రోజూ కొండెక్కాల్సి వస్తోంది. అందుకే కూటి కోసం కోటి కష్టాలు అని కాకుండా.. హాజరు కోసం కోటి పాట్లు అని చెప్పాల్సి వస్తోంది. అయితే ఏ అటెండెన్స్ కోసం వీరంతా ఇలా కొండెక్కుతున్నారనే సంగతిలోకి వస్తే..గ్రామీణ ప్రాంతాలలో వలసలు నివారించేందుకు, గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉపాధి కల్పించేందుకు కేంద్రం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఉపాధి హామీ పథకం కింద ఏటా 125 రోజుల వరకూ పని కల్పి్స్తున్నారు. అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పలు మండలాల్లో సైతం గ్రామీణ ఉపాధి హామీ పనులు జరుగుతున్నాయి. అయితే ఉపాధి హామీ పథకంలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం ఇటీవల ముఖ హాజరు విధానం తీసుకువచ్చింది. ఈ విధానం కింద ప్రతి రోజూ రెండుసార్లు ఉపాధి కూలీలు పని ప్రదేశంలో ఫోటోలు దిగాల్సి ఉంటుంది.అయితే మారుమూల ప్రాంతాలు కావటంతో అల్లూరి జిల్లాలో సిగ్నల్స్ సమస్య వేధిస్తోంది. దీంతో ఎత్తైన కొండ ప్రాంతాలకు చేరుకుని ఉపాధి కూలీలు అటెండెన్స్ నమోదు కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే బొంగిజ గ్రామంలో ఉపాధి పనులు చేసే గిరిజనులు కూడా ఇలా రోజూ కొండెక్కాల్సి వస్తోంది. హాజరు కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకూ వందల మంది కొండపైకి చేరాల్సి వస్తోంది. దీంతో అనారోగ్యంతో ఉన్నవారు, మహిళలు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు వాపోతున్నారు. ఉపాధి హామీ పథకం హాజరు విధానంలో పాత విధానాన్నే కొనసాగించాలని కోరుతున్నారు. మరోవైపు కొత్త విధానం కింద ఉపాధి కూలీలు పనిచేసే ప్రదేశంలో రెండుపూటల ఫోటోలు తీసి అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్లు పని ప్రదేశం నుంచి ఈ హాజరును అప్‌లోడ్ చేయాలి. ఈ విధానం వల్ల బోగస్ మస్టర్లు తగ్గుతాయని, నిజమైన ఉపాధి శ్రామికులకు మాత్రమే వేతనాలు అందుతాయని అధికారులు చెప్తున్నారు.