తెలంగాణ రాష్ట్ర రవాణా ముఖచిత్రాన్ని మార్చబోయే అడుగులు వేగంగా పడుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను దక్షిణ మధ్య రైల్వే జోన్ సిద్ధం చేసి రైల్వే బోర్డుకు సమర్పించింది. సుమారు 122 కిలోమీటర్ల పొడవైన ఈ నూతన రైల్వే లైన్ నిర్మాణానికి రూ.2,844.60 కోట్లు ఖర్చవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ ఎలైన్‌మెంట్ వికారాబాద్‌ నుంచి ప్రారంభమై కర్ణాటక సరిహద్దులోని నారాయణపేట జిల్లా కృష్ణా రైల్వే స్టేషన్‌ సమీపంలో కలిసేలా ఖరారు చేశారు.ఈ ప్రాజెక్టు ప్రాముఖ్యతను గుర్తించిన .. దీని ద్వారా సుమారు 10.09 శాతం ఆర్థిక రాబడి వచ్చే అవకాశం ఉందని తన నివేదికలో స్పష్టం చేసింది. సాధారణంగా 10 శాతం కంటే ఎక్కువ రాబడి ఉండే ప్రాజెక్టులకు రైల్వే శాఖ ప్రాధాన్యత ఇస్తుంది. కాబట్టి ఈ మార్గానికి గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ ప్రతిపాదిత మార్గం అందుబాటులోకి వస్తే వికారాబాద్‌ నుంచి రాయచూరు, హుబ్బళ్లి మీదుగా గోవా వెళ్లే ప్రయాణికులకు ఇది ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయ మార్గంగా మారుతుంది.ప్రస్తుతం ఈ నివేదిక రైల్వే బోర్డులోని ప్రాజెక్ట్‌ ఎవల్యూషన్‌ కమిటీ (PEC) వద్ద పెండింగ్‌లో ఉంది. ఏదైనా కొత్త రైల్వే లైన్ మంజూరు చేసే ముందు సాంకేతిక మరియు ఆర్థిక అంశాలను ఈ కమిటీ క్షుణ్ణంగా విశ్లేషిస్తుంది. ఈ ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అత్యంత కీలకంగా మారింది. రైల్వే లైన్ కోసం అవసరమైన భూసేకరణ ఖర్చును తామే భరిస్తామని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే లిఖితపూర్వక హామీ ఇచ్చింది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా కేంద్ర రైల్వే మంత్రిని కలిసి ఈ ప్రాజెక్టును త్వరగా మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.వెనుకబడిన ప్రాంతాలైన వికారాబాద్, నారాయణపేట జిల్లాల అభివృద్ధికి ఈ రైల్వే లైన్ ఒక వరంగా మారనుంది. రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు పరిశ్రమల స్థాపనకు, వాణిజ్య కార్యకలాపాలకు ఈ మార్గం ఊతం ఇస్తుంది. రైల్వే బోర్డు నుంచి తుది అనుమతి లభిస్తే.. ఈ ప్రాజెక్టు పనులు పట్టాలెక్కడానికి మార్గం సుగమం అవుతుంది. పారిశ్రామికంగా, ఆర్థికంగా ఈ మార్గం రైల్వే శాఖకు కూడా లాభసాటిగా మారుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.