దశాబ్దాల కాలంగా కొనసాగుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ బై చెప్పబోతోంది. రాష్ట్రంలో మారుతున్న జనాభా సమీకరణాలు, తగ్గుతున్న జననాల రేటు భవిష్యత్తులో తీవ్ర మానవ వనరుల కొరతకు దారితీస్తాయన్న హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. జనాభాను తగ్గించడం కంటే ఉన్న జనాభా ఆరోగ్యం, జీవన ప్రమాణాల మెరుగుదల, సంతానోత్పత్తిని ప్రోత్సహించడమే లక్ష్యంగా ‘ఆరోగ్యాంధ్ర పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ’ని తీసుకువస్తోంది. ఈ విధానం కోసం ప్రభుత్వం రూ. 782.25 కోట్లను కేటాయించింది.ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం సంతానోత్పత్తి రేటు ఆందోళనకరంగా 1.5 శాతానికి పడిపోయింది. జనాభా స్థిరీకరణకు ఇది కనీసం 2.1 శాతం ఉండాలి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సంతానోత్పత్తిని పెంచేందుకు పిల్లలే సంపద పేరుతో ప్రతి నెలా నాలుగో శనివారం గ్రామసభలు నిర్వహించాలని నిర్ణయించింది. పిల్లల పెంపకం భారంగా మారుతోందని భావిస్తున్న 53.7 శాతం కుటుంబాలకు అండగా నిలిచేలా పీ4 మోడల్‌లో హక్కుల ఆధారిత విధానాన్ని అమలు చేయనుంది.ఈ పాలసీలో భాగంగా ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. సంతానం లేని నిరుపేద జంటల కోసం ఏటా 50 వేల జంటలకు ఉచితంగా ఐవీఎఫ్ సౌకర్యం కల్పించనుంది. అలాగే మహిళా ఉద్యోగుల కోసం 12 నెలల పాటు తల్లిదండ్రుల ప్రసూతి సెలవుల పైలట్ ప్రాజెక్టును ప్రవేశపెడుతోంది. శిశు సంరక్షణ కేంద్రాలు, వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్ల నిర్మాణంతో పాటు మహిళా కార్మిక శక్తి భాగస్వామ్యాన్ని 25 శాతం పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు, 2036 నాటికి రాష్ట్రంలో వృద్ధుల జనాభా 19 శాతానికి చేరుకుంటుందన్న అంచనాల దృష్ట్యా.. అన్ని జిల్లాల్లో అత్యాధునిక వృద్ధుల సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది.పాలసీ అమలును అత్యున్నత స్థాయిలో పర్యవేక్షించేందుకు ముఖ్యమంత్రి అధ్యక్షతన స్క్రీనింగ్ కమిటీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్ పనిచేస్తాయి. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ద్వారా 5.2 కోట్ల మందికి 100 శాతం డిజిటల్ ఆరోగ్య సేవలను చేరవేయడం, కేర్ ఎకానమీలో 10 వేల మందికి శిక్షణ ఇవ్వడం వంటివి ఈ ప్రాజెక్టులో ప్రధానాంశాలు. అత్యుత్తమ ప్రదర్శన కనబరిచే సచివాలయాలకు ఆరోగ్యాంధ్ర పురస్కారాలను అందజేయడం ద్వారా క్షేత్రస్థాయి యంత్రాంగాన్ని ఉత్సాహపరచాలని ప్రభుత్వం భావిస్తోంది.