ఏపీలోని ఆయిల్‌పామ్ సాగుదారులకు ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్ నెలకు సంబంధించి ఆయిల్‌పామ్ గెలల ధరను టన్నుకు రూ.23,656గా నిర్ణయిస్తూ ఉద్యానశాఖ సంచాలకులు కె.శ్రీనివాసులు అధికారిక ఉత్తర్వులు విడుదల చేశారు. రాష్ట్ర చరిత్రలో ఆయిల్‌పామ్ గెలలకు ఈ స్థాయి ధర లభించడం ఇదే తొలిసారి కావడంతో రైతులు పండుగ చేసుకుంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, స్థానిక డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ఈ రికార్డు ధరను ప్రకటించింది.ప్రస్తుతం రాష్ట్రంలో వేగంగా విస్తరిస్తోంది. సుమారు 2.11 లక్షల మంది రైతులు 2.82 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ఈ తోటలను సాగు చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. ఇతర సంప్రదాయ పంటల కంటే ఆయిల్‌పామ్ లాభసాటిగా ఉండటం, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాల వల్ల ఏటేటా సాగు విస్తీర్ణం పెరుగుతూ వస్తోంది. ముఖ్యంగా ఉద్యానశాఖ తీసుకుంటున్న ప్రత్యేక చర్యలు, క్షేత్రస్థాయిలో రైతులకు అందిస్తున్న అవగాహన కార్యక్రమాలు సత్ఫలితాలనిస్తున్నాయి.గత రెండేళ్ల గణాంకాలను పరిశీలిస్తే.. రాష్ట్రంలో ఆయిల్‌పామ్ విప్లవం స్పష్టంగా కనిపిస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 55,645 ఎకరాల్లో తోటలు ప్రారంభం కాగా.. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య మరింత పెరిగి 75,360 ఎకరాలకు చేరుకుంది. ఈ గణాంకాల ప్రకారం.. గత దశాబ్ద కాలంలోనే ఈ ఏడాది అత్యధిక విస్తీర్ణంలో ఆయిల్‌పామ్ సాగు జరుగుతున్నట్లు ఉద్యానశాఖ స్పష్టం చేసింది. తక్కువ నీటి వినియోగం, అధిక ఆదాయం వచ్చే అవకాశం ఉండటంతో రైతులు ఈ పంట వైపు మొగ్గు చూపుతున్నారు.ప్రభుత్వం ప్రకటించిన ఈ తాజా ధర వల్ల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది రైతులకు ఆర్థికంగా వెసులుబాటు కలగనుంది. సాగు వ్యయం పెరిగినప్పటికీ.. టన్నుకు రూ.23 వేలకు పైగా ధర లభించడం వల్ల నికర లాభం పెరుగుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని రాయితీలు, మౌలిక సదుపాయాలు కల్పిస్తే రాష్ట్రం ఆయిల్‌పామ్ ఉత్పత్తిలో దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.