విజయవాడ: ఆయుర్వేద వైద్య కళాశాలలో లైంగిక వేధింపులు.. ప్రొఫెసర్, ల్యాబ్ టెక్నీషియన్ సస్పెండ్..

Wait 5 sec.

సంచలనం రేపిన విజయవాడ ఆయుర్వేద వైద్య కళాశాల లైంగిక వేధింపుల వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన ప్రభుత్వం.. ఆయుర్వేద వైద్య కళాశాల ప్రొఫెసర్ దేవదత్ మౌళీనాయక్‌తో పాటుగా ల్యాబ్ టెక్నీషియన్ సుబ్రమణ్యంను సస్పెండ్‌ చేస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే కాలేజీ విద్యార్థినులు ఫిర్యాదు చేసినప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ కాలేజీ ప్రిన్సిపల్‌‌తో పాటు ఓ అధ్యాపకురాలిని ప్రభుత్వానికి సరెండర్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆయుష్‌ విభాగం కమిషనర్‌ గోపాలకృష్ణ శనివారం ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు డాక్టర్ నోరి రామశాస్త్రి ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాలలో ఓ ప్రొఫెసర్ విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ ఏపీ మహిళా కమిషన్‌కు ఏప్రిల్ 17వ తేదీన ఫిర్యాదు అందింది. ఓ విద్యార్థిని ఏపీ మహిళా కమిషన్‌కు ఈ విషయంపై మెయిల్ పంపించింది. దీంతో ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రాయపాటి శైలజ.. ఏప్రిల్ 22న ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాలను ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థినులతో ఈ విషయంపై మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే లైంగిక వేధింపులు నిజమేనని నిర్ధారణ అయ్యినట్లు రాయపాటి శైలజ తెలిపారు. అయితే ఈ వ్యవహారం మీద కాలేజీ ఇంటర్నల్ కమిటీ విచారణ నిర్వహించి.. అంతా బాగుందని నివేదిక ఇచ్చినట్లు చూపించిందని వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాల ప్రొఫెసర్‌ దేవదత్ మౌళినాయక్, ల్యాబ్‌ టెక్నీషియన్‌ సుబ్రమణ్యంను సస్పెండ్‌ చేయాలని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్‌ ఏపీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అలాగే ఫిర్యాదుపై నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు పరీక్షల సమయంలో ప్రిన్సిపల్‌ను విధులకు దూరంగా ఉంచాలని ప్రభుత్వానికి మహిళా కమిషన్ సూచించింది. మహిళా కమిషన్ సిఫార్సు నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ప్రొఫెసర్, ల్యాబ్ టెక్నీషియన్లను సస్పెండ్ చేసింది. కాలేజీ ప్రిన్సిపల్, అధ్యాపకురాలిని ప్రభుత్వానికి సరెండర్ కావాలంటూ ఆయుష్ విభాగం కమిషనర్ రోణంకి గోపాలకృష్ణ ఆదేశాలు జారీ చేశారు. మొత్తంగా ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది.