ఐపీఎల్ 2026లో ముంబై ప్రస్థానం దాదాపు ముగిసిపోయిందనే చెప్పొచ్చు. అధికారికంగా సీజన్ నుంచి ఎలిమినేట్ కాకపోయినా ఇక ఇంటికి సిద్ధమైనట్లే లెక్క. చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో చేతిలో ఊహించని పరాజయం పాలయింది. దాంతో ముంబై ఇండియన్స్ అదే తొమ్మిదో స్థానంలో ఫిక్సవగా.. చెన్నై సూపర్ కింగ్స్ ఒక స్థానం మెరుగుపరుచుకుని ప్లే ఆఫ్స్ బరిలో నిలిచింది. చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన హార్దిక్ పాండ్యా రాంగ్ స్టెప్ వేశాడు. సాధారణంగా తొలుత బౌలింగ్ తీసుకునే టాస్ విన్నింగ్ టీమ్.. చెన్నైపై బ్యాటింగ్ తీసుకుని పొరపాటు చేసింది. ఆరభంలోనే వికెట్లు పడినా మొదటి పది ఓవర్లు దాదాపు 10 రన్‌రేట్‌తో కొనసాగింది. ఆ తర్వాత వరుస వికెట్లు పడటంతో 20 ఓవర్లలో 159/7 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈజీ టార్గెట్‌తో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్‌కు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో రాణించి 18.1 ఓవర్లలోనే విజయాన్ని అందించాడు. ఈ విజయంతో ఏడో స్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ ఒక్క స్థానాన్ని మెరుగుపరుచుకుంది. దాంతో పాటు ఇప్పటి వరకు మైనస్ రన్‌రేట్‌లో ఉన్న సీఎస్కే.. తొలిసారి ప్లస్‌లోకి వచ్చేసింది. తొమ్మిది మ్యాచ్‌లు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ 9 మ్యాచ్‌లలో నాలుగు గెలిచి, ఐదు ఓడి ఎనిమిది పాయింట్లతో తన ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం చేసుకుంది. సీఎస్కే ఇంకో నాలుగు మ్యాచ్‌లలో విజయం సాధిస్తే ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టే అవకాశం ఉంది. ఇక పాయింట్స్ టేబుల్‌ని ఒకసారి పరిశీలిస్తే పంజాబ్ కింగ్స్ 13 పాయింట్లతో టాప్ ప్లేస్‌లో కొనసాగుతుండగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 12 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. గుజరాత్ టైటాన్స్ జట్టు పది పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఈ ఐదు జట్లలో నాలుగింటికి ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయిచెన్నై సూపర్ కింగ్స్ 8 పాయింట్లతో ఆరో స్థానంలో కొనసాగుతూ ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టేందుకు ప్రయత్నిస్తుంది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కూడా తొమ్మిది మ్యాచ్‌లలో నాలుగు గెలిచి 8 పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. కోల్‌కతా నైట్ రైడర్స్ ఐదు పాయింట్లతో 8వ స్థానంలో ఉండగా, ముంబై ఇండియన్స్ తొమ్మిది, లక్నో సూపర్ జెయింట్స్ 4 పాయింట్లతో అట్టడుగు స్థానానికి పరిమితమైంది.