మండే ఎండల నుంచి ఉపశమనం.. ఐదు రోజులు వానలు.. శనివారం ఈ జిల్లాల్లో వర్షాలు..

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త. మండే ఎండల నుంచి ఉపశమనం కలిగిస్తూ వచ్చే ఐదు రోజుల పాటు ఏపీలో వర్షాలు కురవనున్నాయి. ఈ విషయాన్ని విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. మరో ఐదు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురుస్తాయని.. ఉత్తర , దక్షిణ కోస్తా జిల్లాలలో మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేశారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసేందుకు అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని.. మత్స్యకారులు సముద్రంలోకి చేపలవేటకు వెళ్లవద్దని విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ హెచ్చరించారు. మరోవైపు ఉపరితల ద్రోణి ప్రభావంతో శనివారం రోజున ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటుగా చిత్తూరు, తిరుపతి జిల్లాలలో తేలికపాటి వానలు పడతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పిడుగులు పడే అవకాశం ఉందని అప్రమత్తం చేసింది. ఇక ద్రోణి ప్రభావంతో శుక్రవారం రోజున ఉత్తరాంధ్రలోని పలుప్రాంతాలలో వర్షం కురిసింది. ముఖ్యంగా విజయనగరం జిల్లాలో వడగండ్ల వాన పడింది. ఉరుములు, మెరుపులతో వడగండ్ల వాన కురవటంతో ఉక్కబోతతో ఇబ్బందులు పడుతున్న జనం కాస్త ఉపశమనం పొందారు. అయితే వడగండ్ల వాన కారణంగా వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. కొన్నిచోట్ల పంటలు దెబ్బతిన్నాయి. మరోవైపు గత కొన్ని రోజుల నుంచి ఏపీలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పగటి పూట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకూ నమోదవుతున్న పరిస్థితి. దీనికి తోడు వడగాల్పుల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితులలో ఐదురోజుల పాటు వానలు కురవొచ్చన్న వాతావరణ శాఖ అంచనాలు.. ప్రజలకు ఉపశమనం కలిగిస్తున్నాయి. అలాగే ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే కాస్త ముందుగానే దేశంలోకి రావచ్చనే అంచనాలు కూడా ప్రజలు, రైతులకు ఊరట కలిగిస్తున్నాయి. అయితే ఉన్నట్లుండి కురుస్తున్న అకాల వర్షాలు, వడగండ్ల వానలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.