గురువారం విడుదలైన పదో తరగతి ఫలితాల్లో ఓ గృహిణి, ఆమె కుమారుడు ఉతీర్ణులయ్యారు. జిల్లాకు చెందిన ఆ తల్లీకొడుకులు ఒకేసారి పరీక్ష రాస్తే కుమారుడికి 94 శాతం, తల్లికి 60 శాతం మార్కులు వచ్చాయి. అనుకోని అవాంతరాలతో చదువు మధ్యలోనే ఆపేసినా... ఆమెకు మాత్రం చదువుపై మమకారం పోలేదు. ఓపెన్ స్కూల్‌లో చేరిన ఆమె తన బిడ్డతో కలిసి మళ్లీ పుస్తకాలు పట్టారు. వివరాల్లోకి వెళ్తే.. పాలకొల్లు మండలం పూలపల్లి గ్రామానికి చెందిన బండారు లక్ష్మీ లహరి కొన్ని కారణాలతో ఆరో తరగతిలోనే చదువు నిలిపేశారు. ఆ తర్వాత వివాహం కావడంతో భర్త, పిల్లలతోనే గడిచిపోయింది.కానీ, ఆమెకు మనసులో చదువుకోవాలనే కోరిక మాత్రం అలాగే ఉండిపోయింది. అయితే, ప్రయివేట్ స్కూల్‌లో చదువుతున్న ఆమె కుమారుడు శరణ్‌ విజయ్ ఈ ఏడాది పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. దీంతో తాను కూడా పరీక్షలు రాయాలని ఆమె భావించింది. అందుకు ఓపెన్ స్కూల్ సొసైటీలో పరీక్షలకు ఫీజు చెల్లించి.. కొడుకు చదువుతుంటే ఆమె కూడా పుస్తకాలతో కుస్తీ పట్టింది. రావులపాలెం కేంద్రంలో పరీక్షలకు హాజరయ్యారు. గురువారం విడుదలైన పదో తరగతి ఫలితాల్లో శరణ్ విజయ్ 600లకుగానూ 562 మార్కులు సాధించగా... లక్ష్మీ లహరి 500 మార్కులకు 360 సాధించారు. తల్లీకొడుకులు ఒకేసారి పదో తరగతి ఉత్తీర్ణులు కావడంతో కుటుంబంలో సంతోషం వెల్లివిరిసింది. వారిని కుటుంబసభ్యులు, ఉపాధ్యాయులు, గ్రామస్థులు అభినందించారు. గృహిణిగా బాధ్యతలు నిర్వహిస్తూనే ఇన్నేళ్ల తర్వాత మళ్లీ పుస్తకం పట్టి పదో తరగతిలో ఉత్తీర్ణులైనందుకు ఆమెపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.కాగా, ఈ ఏడాది ఉత్తీర్ణత 85. 25 శాతంగా ఉంది. గతేడాదితో పోల్చితే ఇది 4 శాతం అధికం. అయితే, ఈసారి కూడా బాలుర కంటే బాలికల ఉత్తీర్ణత శాతం అధికంగా ఉంది. 5. 22 శాతం మంది బాలికలు.. బాలుర కంటే అధికంగా ఉత్తీర్ణులయ్యారు. అలాగే, ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఉత్తీర్ణత పెరిగింది. గతేడాది ఇది 72.8 శాతం ఉండగా.. ఈసారి 78.39 శాతానికి చేరింది.