హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టడంతో పాటు, సామాన్య, మధ్యతరగతి ప్రజలకు రవాణా భారాన్ని తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా అందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించే ప్రక్రియ తుది దశకు చేరుకుంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2వ తేదీ నుంచి ఈ పథకాన్ని ప్రయోగాత్మక ప్రాతిపదికన ఏడాది పాటు అమలు చేసేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేస్తోంది.దక్షిణ మధ్య రైల్వే సూచనల మేరకు ఉచిత ప్రయాణ పథకం అమలుకు అవసరమైన నిబంధనలతో కూడిన ముసాయిదా ఒప్పందాన్ని అధికారులు సిద్ధం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ సాంకేతిక, ఆర్థిక అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ఎంవోయూను రూపొందించారు. ప్రస్తుతం ఈ దస్త్రం న్యాయశాఖ, ఆర్థికశాఖ, సీఎంవో పరిశీలనలో ఉంది. అక్కడి నుంచి ఆమోదం లభించిన వెంటనే దీనికి తుది ఆమోదం కోసం రైల్వే బోర్డుకు పంపించనున్నారు.ప్రస్తుతం సేవల ద్వారా రైల్వే శాఖకు ఏడాదికి సుమారు రూ. 10 కోట్ల ఆదాయం వస్తోంది. ఉచిత ప్రయాణం వల్ల ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగినా.. రైల్వేకు వచ్చే ప్రస్తుత ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చింది. కొవిడ్ కంటే ముందు రోజుకు 1.20 లక్షల మంది ప్రయాణించే ఎంఎంటీఎస్‌లో ప్రస్తుతం సరైన సమయపాలన లేకపోవడం వల్ల ఆ సంఖ్య 40 వేలకు పడిపోయింది. ప్రభుత్వ తాజా చొరవతో ఎంఎంటీఎస్‌కు పూర్వ వైభవం రావడమే కాకుండా.. నగర రోడ్లపై వాహనాల రద్దీ, వాయు కాలుష్యం గణనీయంగా తగ్గుతాయని అంచనా వేస్తున్నారు.కేవలం ఉచిత ప్రయాణమే కాకుండా ఎంఎంటీఎస్ సేవలను మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రద్దీ సమయాల్లో ఎక్కువ రైళ్లను నడిపేలా రైల్వే బోర్డును కోరింది. దాంతో పాటు ప్రయాణికులు స్టేషన్ నుంచి తమ ఇళ్లకు చేరుకోవడానికి వీలుగా 'లాస్ట్ మైల్ కనెక్టివిటీ' కోసం ఆర్టీసీ షటిల్ బస్సులను నడపనున్నారు. స్టేషన్లలో సౌకర్యాలను మెరుగుపరచడంతో పాటు బస్సుల పార్కింగ్ కోసం రైల్వే ప్రాంగణాల్లో స్థలం కేటాయించాలని కోరారు. జూన్ 2 నుంచి ప్రారంభం కానున్న ఈ పథకం హైదరాబాద్ ప్రయాణికుల పాలిట వరప్రదాయినిగా మారబోతోందని అధికారులు చెబుతున్నారు. కాగా, తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తోంది. జీరో టికెట్ తీసుకొని మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్లు ఆర్డీనరీ నుంచి ఎక్స్‌ప్రెస్ బస్సుల వరకు రాష్ట్రంలోని ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఫ్రీగా జర్నీ చేయవచ్చు.