: కేంద్ర ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ విభాగం.. పీఐబీ ఫ్యాక్ట్‌చెక్ కీలక ప్రకటన చేసింది. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినట్లుగా వస్తున్న ఊహాగానాల్ని కొట్టిపారేసింది. మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ నాచురల్ గ్యాస్ విభాగం నుంచి ధరల పెంపునకు సంబంధించి ఎలాంటి ప్రకటనా రాలేదని.. నకిలీ ప్రచారం చేస్తున్నారని స్పష్టం చేసింది. ఈ మేరకు ఫేక్ సోషల్ మీడియా పోస్టుల్ని కోట్ చేస్తూ.. సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్‌లో పోస్ట్ చేసింది. 'ఈ ఆర్డర్ నకిలీది. భారత ప్రభుత్వం ఇలాంటి ఉత్తర్వుల్ని అసలు జారీ చేయలేదు.' అని అందులో పేర్కొంది. ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ లీడర్లు ఈ నకిలీ పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. దేశంలో పెట్రోల్ ధర రూ. 10, డీజిల్ ధర రూ. 12.50 పెరిగినట్లు.. భారత పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ నుంచి సర్క్యులర్ వచ్చినట్లుగా ఉన్న ప్రెస్ నోట్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. దీనినే నకిలీది అని కేంద్రం స్పష్టం చేసింది. ఇలాంటి నకిలీ వార్తల్ని, ప్రకటనల్ని నమ్మొద్దని.. ఇలాంటి వార్తల్ని ధ్రువీకరించుకునేందుకు ఎల్లప్పుడూ అధికారిక ప్రభుత్వ వెబ్‌సైట్లు, ఛానెళ్లను చూడాలని స్పష్టం చేసింది. తప్పుడు ప్రచారాన్ని అడ్డుకునేందుకు.. @PIBFACTCHECK టీమ్‌కు ట్యాగ్ చేయాలని కోరింది. దేశంలో ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగానే ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 94.77 గా ఉండగా.. డీజిల్ రూ. 87.67 పలుకుతోంది. ముంబైలో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రూ. 103.54, రూ. 90.03 వద్ద ఉన్నాయి. ఇక హైదరాబాద్ నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.46 వద్ద ఉండగా.. డీజిల్ ధర రూ. 95.70 వద్ద ఉంది. దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో చూస్తే.. హైదరాబాద్‌లోనే ధరలు ఎక్కువగా ఉన్నాయి. ఎన్నికల తర్వాత ధరల పెంపు?దేశంలో ఇటీవల 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 29నే బెంగాల్‌లో చివరి దశ పోలింగ్‌తో.. ఎన్నికలు ముగిశాయి. ఈ క్రమంలో.. కొద్ది రోజుల ముందు నుంచే దేశంలో.. ఎన్నికలు ముగియగానే పెట్రోల్, డీజిల్ ధరల్ని కేంద్రం పెంచుతుందని వార్తలు వచ్చాయి. అయితే నాలుగేళ్ల గరిష్ఠానికి క్రూడాయిల్ ధరలు..అమెరికా- ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో చమురు రవాణాకు కీలకంగా ఉన్న హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేసింది. మరోవైపు ఇరాన్ ఓడరేవుల్ని అమెరికా దిగ్బంధించింది. అక్కడ ఉద్రిక్తతల కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొంది. భారత్‌లోనూ నిల్వలు తక్కువగా ఉన్నాయి. క్రూడాయిల్ ధరలు పెరుగుతున్నాయి. ఒకవైపు.. కొన్ని పెట్రోల్ బంకులు రద్దీగా కనిపిస్తుంటే.. కొన్ని నో స్టాక్ బోర్డులతో దర్శనమిస్తున్నాయి. దీంతో జనం భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇదే సమయంలో ధరల్ని పెంచుతుందని ఆందోళనకు గురవుతున్నారు. .