తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు ముఖ్యగమనిక. ఉత్తరాంధ్రలో ప్రారంభమై కోస్తా మీదుగా రాయలసీమకు వెళ్లే తిరుమల ఎక్స్‌ప్రెస్‌ రైలును పొడిగించారు. ప్రస్తుతం తిరుమల ఎక్స్‌ప్రెస్‌ (18522/18521) విశాఖపట్నం–కడప–విశాఖపట్నం మధ్య నడుస్తోంది. తాజాగా ఈ రైలును కడప కాకుండా గుంతకల్లు వరకు పొడిగిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. మే 12 నుంచి గుంతకల్లు–విశాఖపట్నం తిరుమల ఎక్స్‌ప్రెస్‌ (18522).. మే 13 నుంచి విశాఖపట్నం–గుంతకల్లు తిరుమల ఎక్స్‌ప్రెస్‌ (18521) రెగ్యులర్‌ సర్వీసుగా ప్రకటించారు. విశాఖపట్నం–గుంతకల్లు (18521) ఎక్స్‌ప్రెస్‌ రైలు విశాఖపట్నంలో మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11.30 గంటలకు గుంతకల్లు చేరుకుంటుంది. మరుసటి రోజు ఉదయం 7.03కి కడప చేరుకుంటుంది.. అనంతరం 7.38కి యర్రగుంట్ల, 8.10కి కొండాపురం, 8.33కి తాడిపత్రి, 9.13కి గుత్తి, 11.30 గంటలకు గుంతకల్లు చేరుకుంటుంది. గుంతకల్లు టు విశాఖపట్నం రైలు (18522) తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 1.30 గంటలకు గుంతకల్లులో బయల్దేరి 1.55కి గుత్తి, 2.50కి తాడిపత్రి, 3.13కి కొండాపురం, సాయంత్రం 5.38కి కడప చేరుకుంటుంది. మరుసటి రోజు ఉదయం 11 గంటలకు దువ్వాడ, 11.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుందని అధికారులు తెలిపారు. మరోవైపు మైసూరు-కాకినాడటౌన్‌ స్పెషల్‌ బైవీక్లీ ఎక్స్‌ప్రెస్‌ (07033/07034) రైలు ఇకపై రెగ్యులర్‌ బైవీక్లీ ఎక్స్‌ప్రెస్‏ (17289/17290)గా నడవనుంది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మే 1వ తేదీ కాకినాడటౌన్‌-మైసూరు (17289) బైవీక్లీ రెగ్యులర్‌ ఎక్స్‌ప్రెస్‏ సోమ, శుక్రవారాల్లో వారానికి రెండురోజులు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు కాకినాడ టౌన్‌లో ఉదయం 9 గంటలకు బయలుదేరి మరుసటిరోజు మధ్యాహ్నం 4 గంటలకు మైసూరు వెళుతుంది. మే 2వ తేదీ నుంచి మైసూరు-కాకినాడ టౌన్ రైలు (17290) తిరుగు ప్రయాణంలో మంగళ, శనివారాలలో మైసూరులో సాయంత్రం 5.05 గంటలకు బయలుదేరి మరుసటిరోజు రాత్రి 11-30 గంటలకు కాకినాడ టౌన్‌కు చేరుకుంటుంది. ఈ రైలు కాకినాడ టౌన్‌లో బయల్దేరి సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తణుకు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, నల్లగొండ, సికింద్రాబాద్, బేగంపేట, లింగంపల్లి, వికారాబాద్, సేడం, యాద్గిర్, ఆదోని, రాయచూరు, మంత్రాలయం రోడ్డు, ఆదోని, గుంతకల్లు, అనంతపురం, ధర్మవరం, హిందూపురం, యలహంక, బెంగళూరు కంటోన్మెంట్, బెంగళూరు కెంగేరి, రామనగరం, చెన్నపట్న, మాండ్యా మీదుగా మైసూరు చేరుకుంటుంది.