ఏఐ సాయంతో ఏపీ మంత్రి సంతకం ఫోర్జరీ.. ఈ తండ్రీకొడుకులు మాములోళ్లు కాదు, ఏం జరిగిందంటే!

Wait 5 sec.

ఇటీవలి కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ను జనాలు గట్టిగానే వాడేస్తున్నారు. ఏపీలో తండ్రీకొడుకులు మాత్రం ఏఐ టెక్నాలజీతో ఏకంగా మంత్రి సంతకాన్ని ఫోర్జరీ చేశారు. కానీ కథ అడ్డం తిరగడంతో పోలీసులకు దొరికిపోయారు. తనకల్లు మండలం చీకటిమానుపల్లికి చెందిన జయచంద్ర భార్య రమణమ్మ కడప రిమ్స్‌‌లో స్టాప్ నర్సుగా పనిచేస్తున్నారు. ఆమె ప్రతిరోజూ సొంత ఊరికి వచ్చి వెళ్లేందుకు ఇబ్బందిపడుతున్నారు. జయచంద్ర తన భార్య రమణమ్మను కడప నుంచి శ్రీసత్యసాయి జిల్లాకు బదిలీ చేయించాలనుకున్నారు.. ఆయన ఈ విషయాన్ని కదిరి మండలం కౌలేపల్లికి చెందిన తన బంధువు పలక గంగాద్రికి చెప్పారు. కడప నుంచి వచ్చి వెళ్లడం, పిల్లల బాగోగులు చూసుకోవడానికి ఇబ్బందిగా ఉందన్నారు. వెంటనే గంగాద్రి తన కుమారుడు వేణుతో కలిసి పక్కా ప్లాన్ చేశారు. రమణమ్మ బదిలీని క్యాష్ చేసుకోవాలనుకున్నారు.. ఎలాగైనా జయచంద్రను మోసం చేసి డబ్బులు సంపాదించాలి అనుకున్నారు. వైద్యఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పీఏ శేషాద్రి తమకు తెలుసంటూ తండ్రీకొడుకులు జయచంద్రకు చెప్పారు.మంత్రి పీఏతో మాట్లాడి రమణమ్మను బదిలీ చేయిస్తామని చెప్పి రూ.లక్ష వసూలు చేశారు. గంగాద్రి కుమారుడు వేణు రమణమ్మ వివరాలు తీసుకున్నారు.. తన మొబైల్‌లో ఏఐ సాయంతో మంత్రి సత్యకుమార్ డిజిటల్ సంతకాన్ని ఫోర్జరీ చేశారు. నకిలీ ట్రాన్స్‌ఫర్ ఆర్డర్ తయారు చేసి జయచంద్ర వాట్సాప్‌కు పంపారు. ఒరిజనల్‌ సర్టిఫికెట్‌‌గా తయారు చేశారు. జయచంద్రకు ఆ ఆర్డర్ కాపీ చూడగానే ఎందుకో అనుమానం వచ్చి వెంటనే అధికారులకు చూపిస్తే నకిలీదని చెప్పారు. అంతేకాదు మంత్రి పీఏగా శేషాద్రి అనే వ్యక్తి ఉన్నాడా లేదో కూడా ఆరా తీశారు. మంత్రి సత్యకుమార్‌ దగ్గర శేషాద్రి పేరుతో ఎవరూ పీఏగా లేరని తెలిసింది. అప్పుడు గంగాద్రి, వేణు తమను మోసం చేశారని గుర్తించిన బాధితులు ఈ నెల 26న తనకల్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఈ నకిలీ ట్రాన్స్‌ఫర్ ఆర్డర్ కేసులో గంగాద్రి, వేణులను పోలీసులు అరెస్ట్ చేశారు.