గాంధీ హాస్పిటల్‌లో ఉచిత IVF.. పిల్లల కోసం పదేళ్లుగా నిరీక్షణ, కవలలకు జన్మనిచ్చిన మహిళ

Wait 5 sec.

సర్కార్ దవాఖానా అంటే కేవలం సాధారణ చికిత్సలకే పరిమితం కాదని.. కార్పొరేట్ స్థాయి అత్యాధునిక వైద్య సేవలు కూడా అందుతాయని సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి వైద్యులు మరోసారి నిరూపించారు. సంతానలేమితో బాధపడుతున్న ఒక నిరుపేద దంపతుల జీవితంలో ఆనందాన్ని నింపారు. హైదరాబాద్ బోయిగూడకు చెందిన గడ్డం త్రివేణి, మస్తాన్‌రావు దంపతులకు వివాహమై పదేళ్లు గడిచినా పిల్లలు కలుగలేదు. పిల్లల కోసం వారు తిరగని ఆసుపత్రి లేదు, మొక్కని దేవుడు లేడు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఏకంగా 13 సార్లు కృత్రిమ సంతానం కోసం ప్రయత్నించినా ఫలితం దక్కకలేదు. దానికి తోడు ఆర్థికంగానూ చితికిపోయారు. దీంతో వారు కేంద్రాన్ని సందర్శించారు. అక్కడి వైద్యులు త్రివేణి దంపతులకు భరోసా ఇచ్చారు. గాంధీ ఐవీఎఫ్ కేంద్రం హెడ్ డాక్టర్ టి. శోభ నేతృత్వంలోని బృందం త్రివేణికి చికిత్స అందించింది. వైద్యుల కృషి ఫలించి.. బుధవారం త్రివేణి కవల పిల్లలు ఒక బాబు, ఒక పాపకు జన్మనిచ్చింది. పదేళ్ల నిరీక్షణ తర్వాత తమ చేతుల్లోకి ఇద్దరు బిడ్డలు రావడంతో ఆ దంపతుల ఆనందానికి అవధులు లేవు. లక్షలు ఖర్చు పెట్టినా సాధ్యం కానిది.. ప్రభుత్వ ఆసుపత్రిలో పైసా ఖర్చు లేకుండా సాధ్యం కావడం పట్ల వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ అరుదైన విజయాన్ని సాధించిన గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వాణి, ఐవీఎఫ్ సెంటర్ హెడ్ డాక్టర్ టి. శోభ, డాక్టర్ ఫాతిమా, డాక్టర్ శివకృష్ణ, ఇతర సిబ్బందిని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వ ఆసుపత్రులు వైద్య రంగంలో కొత్త మైలురాళ్లను అధిగమిస్తున్నాయని ఆయన కొనియాడారు. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక లోపాల కారణంగా ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. పిల్లల కోసం పరితపిస్తున్నారు. దీనికి పరిష్కారంగా ఉన్న ఐవీఎఫ్ చికిత్స ప్రైవేట్ ఆసుపత్రుల్లో లక్షల రూపాయల ఖర్చుతో కూడుకున్నది. చాలా ప్రైవేటు ఆసుపత్రుల్లో రూ.2- 6 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. దీంతో నిరుపేదలకు ఇది అందని ద్రాక్షగానే మిగిలిపోతోంది. ఈ క్రమంలోనే రెండేళ్ల క్రితం తెలంగాణ ప్రభుత్వం పేదలకు అండగా ఉండాలని సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో ప్రారంభించింది. సంతానలేమితో బాధపడుతున్న నిరుపేదలు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి డబ్బులు ఖర్చు చేసుకోంకుండా.. గాంధీలోని అత్యాధునిక ఉచిత సేవలను వినియోగించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.