బంగారు ఆభరణాలకు భారీగా తగ్గిన డిమాండ్.. అంతా అటే మళ్లిస్తున్నారుగా.. ఏకంగా 82 వేల కిలోలు!

Wait 5 sec.

: మన దేశంలో తొలిసారిగా ఒక త్రైమాసికంలో బంగారాన్ని ఆభరణాల రూపంలో కాకుండా.. పెట్టుబడుల కోసం ఎక్కువగా కొనుగోలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. అవును.. 2026 సంవత్సరం తొలి త్రైమాసికంలో (జనవరి- మార్చి) పసిడి ఆభరణాల గిరాకీ భారీగా తగ్గగా.. దీనికి భిన్నంగా పెట్టుబడి డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఈ మేరకు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (ప్రపంచ స్వర్ణ మండలి) తాజా రిపోర్ట్‌లో వెల్లడించింది. అంటే ఆభరణాల వినియోగాన్ని.. పెట్టుబడి డిమాండ్ అధిగమించిందన్నమాట. ఇటీవలి కాలంలో అంతర్జాతీయంగా అనిశ్చితి నేపథ్యంలో.. ఈక్విటీల్లో నష్టాలు వస్తుండటంతో సురక్షిత పెట్టుబడి సాధనంగా పెడుతున్నారని.. ఇదే ఆభరణాల డిమాండ్ తగ్గేందుకు కారణమైందని వెల్లడించింది. భారత్.. బంగారం వినియోగంలో ప్రపంచంలోనే చైనా తర్వాత రెండో అతిపెద్ద దేశంగా ఉంది. ఇక్కడ సాధారణంగా ఎప్పుడూ ఆభరణాలకే డిమాండ్ అధికంగా ఉంటుంది. మహిళలు.. పెళ్లిళ్లు, పండగలు, ఇతర శుభకార్యాల సమయాల్లో ఎక్కువగా గోల్డ్ జువెల్లరీ కొనుగోలు చేసి ధరించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. కానీ ఇటీవల ఈ ట్రెండ్ మారిపోయింది. ఒకవైపు బంగారం ధరలు పెరగడం.. మరోవైపు ఆభరణాలకు తయారీ, తరుగు ఛార్జీలు ఎక్కువగా ఉంటుండటంతో.. ఆభరణాల కొనుగోళ్లు (22 క్యారెట్లు) తగ్గించారు. దీంతో మేలిమి బంగారం (24 క్యారెట్లు) కొనుగోలు చేసి అట్టిపెట్టుకుంటున్నారు. ఇదే సమయంలో బంగారాన్ని నాణేలు, బిస్కెట్ల రూపంలో కొనుగోలు చేయడం ఇంకా.. డిజిటల్‌గా ఈటీఎఫ్‌ల రూపంలో పసిడిపైన పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య ఎక్కువవుతోంది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్ ప్రకారం.. జనవరి- మార్చిలో దేశయంగా పెట్టుబడుల రీత్యా పసిడి కొనుగోళ్లు అంతకుముందు ఇదే సమయంతో పోలిస్తే ఏకంగా 54 శాతం పెరిగి 82 టన్నులకు చేరింది. టన్ను అంటే 1000 కిలోలు. అంటే మొత్తంగా ఇది 82 వేల కిలోలుగా ఉంటుంది. ఇక ఆభరణాల గిరాకీ మాత్రం ఏకంగా 19 శాతం తగ్గి 66 టన్నులకు (66 వేల కిలోలు) పరిమితమైనట్లు డబ్ల్యూజీసీ పేర్కొంది. దీని విలువ మాత్రం 47 శాతం పెరిగి రూ. 99,920 కోట్లకు చేరుకుంది. ఆభరణాల కొనుగోళ్లు తగ్గినప్పటికీ.. ఓవరాల్‌గా భారత్‌లో తొలి త్రైమాసికంలో 10.2 శాతం మేర పెరిగి 151 టన్నులకు చేరిందని ప్రపంచ స్వర్ణ మండలి (WGC) తెలిపింది. అంతకుముందు ఇదే సమయంలో పసిడి డిమాండ్ 137.4 టన్నులుగానే ఉంది. మొత్తం విలువ పరంగా చూస్తే వార్షిక ప్రాతిపదికన 99 శాతం పెరిగి రూ. 2.27 లక్షల కోట్లకు చేరుకుంది. కానీ ఇలా ఒక త్రైమాసికంలో చూస్తే.. మొత్తం బంగారం గిరాకీలో పెట్టుబడుల వాటా ఎక్కువగా ఉండటం ఇదే తొలిసారని వెల్లడించింది.